సరదాగా వెళ్లి అనంతలోకాలకు
దోమ: సరదా కోసం బయటకు వెళ్లిన ఓ బాలుడు అనంతలోకాలకు చేరాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బుద్లాపూర్ అనుబంధ గోన్యానాయక్‌తండాకు చెందిన శంకర్, కవితకు ఓ కొడుకు, కూతురు సంతానం. కుమారుడు బాలాజీ(13) పరిగి పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే స్నేహితులతో కలసి సరదాగా ఆడుకున్న అతను.. ఆదివారం పలువురితో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం వేళ అందరూ కలిసి బొంరాస్‌పేట్ మండలం ఏర్పుమల్ల సమీపంలోని కాకరణవేణి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఈత కొట్టేందుకు అందరూ కలిసి నీళ్లలోకి దిగారు. ఈత రాని బాలాజీ సైతం వీరిని అనుసరించి మునిగిపోయాడు. వెతికినా కనిపించకపోవడంతో మిగిలిన వారు ఇంటి బాట పట్టారు. సాయంత్రమైనా కుమారుడు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఈక్రమంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లినట్లు స్థానికులు చెప్పడంతో అక్కడికి చేరుకుని వెతికారు. అప్పటికే చీకటి పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం కుటుంబీకులు వెళ్లి చూడగా బాలాజీ శవమై తేలాడు. ఇది చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. మృతదేహానికి పరిగి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కాకరణవేణి ప్రాజెక్టులో మునిగి బాలుడి దుర్మరణం
గోన్యానాయక్ తండాలో విషాదం