
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
అనంతగిరి: పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ నమోదు, మార్పులు చేర్పులు, బూతు స్థాయి ఏజెంట్ల నియామకం, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల సమర్పణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో ఓటు ప్రాముఖ్యతను కలిగి ఉండేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం 6 నింపి నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అన్నారు. మీసేవ, ఆన్‌లైన్, హెల్ప్‌లైన్, మొబైల్‌లతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫారం 7తో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని అదేవిధంగా ఫారం 8తో ఓటరు బదిలీ, పోలింగ్ కేంద్రం బదిలీ, కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకోవడం ఉంటుందన్నారు. బూతు స్థాయి ఏజెంట్ల నియామకం వారం రోజుల్లోగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆయన సూచించారు. జాబితాలను పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్‌ఓల మొబైల్ నంబర్‌తో సహా తహసీల్దార్లకు లేదా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జిల్లా పార్టీల అధ్యక్షుల సంతకాలతో సమర్పించాలని తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ ఉష్యానాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం