
రాయితీలను అందిపుచ్చుకోవాలి
అనంతగిరి: రైతులు లాభదాయక పంటలు వేయడానికి ముందుకు రావాలని ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను, పథకాలను అందిపుచ్చుకోవాలని వికారాబాద్ నియోజకవర్గ ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి వైజయంతి కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయ పరిశోధన కేద్రం, వికారాబాద్ ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మదనపల్లి గ్రామంలో మహిళా దళిత రైతులకు దుంప పంటల సాగులో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో చామగడ్డ, మొరంగడ్డ ముఖ్యమైనవని అన్నారు. అవీ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే సాగు చేయబడుతుందని చెప్పుకొచ్చారు. వికారాబాద్ పట్టణ పరిసరప్రాంతాల్లోని అత్వెల్లీ, కొంపల్లి, మదనపల్లి, ఎర్రవల్లి, ఫులమద్ది గ్రామాల్లోని భూములు ఈ దుంప పంటలకు అనుకూలం. హైదరాబాద్ సమీపాన ఉండతో కూరగాయల సాగు చేపట్టవచ్చని చెప్పారు. అనంతరం శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.సురేశ్ మాట్లాడుతూ చామగడ్డ, మొరం గడ్డ సాగు, యాజమన్య పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కూరగాయ పరిశోధన కేంద్రం ఏఈవోలు ప్రశాంత్, కుమార్, అధికారులు, రైతులు హన్మంతు, అశోక్, రైతులు పాల్గొన్నారు.