తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు క్రమంగా పెరుగుతున్నాయి. గంటా–అయ్యన్నతో మొదలైన ఈ విభేదాలు కాస్తా తాజాగా విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాలకూ పాకాయి. విశాఖ దక్షిణ సీటుపై భరత్ కన్నేయగా.. గండి బాబ్జీ చూపు కాస్తా పెందుర్తిపై పడింది. పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు అవినీతిపరుడంటూ ఆయన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మరోవైపు పాయకరావుపేటలో గంటా, చిరంజీవి ఫొటోలు లేకుండానే అనిత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించడంతో ఆ పార్టీ కాపు నేతలు మండిపడుతున్నారు. అయినా అయ్యన్న అండతో అనిత తగ్గేదేలే అని అంటున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో విభేదాల పర్వం క్రమంగా అన్ని నియోజకవర్గాలకూ పాకుతోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో విశాఖ దక్షిణ సీటు కాస్తా హీటు పుట్టిస్తోంది. విశాఖ దక్షిణం నుంచి పోటీ చేసేందుకు భరత్ ఆసక్తి చూపుతుండటం.. పెందుర్తి నియోజకవర్గంలోనూ సెగలు రేపుతోంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన భరత్ ఇప్పుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీలుగా ‘మీ కోసం– మీ భరత్’ పేరుతో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ పాదయాత్రలు కూడా కేవలం దక్షిణ నియోజకవర్గానికే పరిమితం కావడం చర్చనీయాంశమవుతోంది. విచిత్రంగా ఈ పాదయాత్రలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న గండి బాబ్జీ కూడా పాల్గొంటుండటం గమనార్హం. ఇది కాస్తా ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో చర్చకు దారితీసింది.
పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీలుగా గండి బాబ్జీ పావులు కదుపుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఇదే అదునుగా గత ఎన్నికల్లో తనకు సీటు ఇస్తే గెలిచేవాడినని.. అవినీతి వ్యవహారంలో కూరుకుపోయిన బండారు ఓడిపోతారని తాను ముందే పార్టీ పెద్దలకు చెప్పినట్టు గండి బాబ్జీ వ్యాఖ్యానించడం కొత్త చర్చకు తెరలేపింది. మరోవైపు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో గంటా శ్రీనివాసరావు, చిరంజీవి వంటి నేతల ఫొటోలు లేకుండా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యవహారంపై ఆ పార్టీ కాపు నేతలు మండిపడుతున్నారు.
తమను చిన్నచూపు చూస్తున్న అనిత తీరు మార్చుకోకపోతే అంతిమంగా తామంతా టీడీపీకి దూరమవుతామని కూడా నియోజకవర్గ కాపు నేతలు హెచ్చరించారు. ఇక ఇప్పటికే గంటాకు అయ్యన్నకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా మండుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య రేగుతున్న విభేదాలు క్రమంగా అన్ని నియోజకవర్గాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
నేత లేకపోవడంతో..
విశాఖ దక్షిణ నియోజకవర్గానికి టీడీపీకి నాయకుడు లేని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్‌కుమార్ కాస్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీని కాదని దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కాస్తా దక్షిణ నియోజకవర్గంలో నాయకుడు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గండి బాబ్జీని నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు.
అయిష్టంగానే ఈ బాధ్యతలను స్వీకరించిన గండి బాబ్జీ.. నామమాత్రంగా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తెరపైకి భరత్ రావడంతో.. తన కన్ను కాస్తా పెందుర్తిపై పడింది. ఇదే అదనుగా బండారుతో పాటు ఆయన కుమారుడుపై కూడా అవినీతి ఆరోపణలు రావడంతోనే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరోసారి ఆయనకు సీటు ఇచ్చినా ఓటమి తథ్యమని కూడా తన సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం.
గంటా–అయ్యన్న మధ్య మరింత గ్యాప్!
గంటా శ్రీనివాసరావుకు, అయ్యన్న పాత్రుడుకు మధ్య రోజురోజుకీ గ్యాప్ మరింత పెరుగుతోంది. ఇప్పటికే తన నియోజకవర్గంలో గంటా తలదూరుస్తున్నారన్న అనిత... తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఫొటో లేకుండానే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక కొద్దిరోజుల క్రితం ఉత్తరాంధ్ర సమీక్ష కోసం విశాఖ వచ్చిన చంద్రబాబుకు ముందురోజే అయ్యన్న ఝలక్ ఇచ్చారు. తాను సమీక్షకు రానని భీష్మించుకూర్చున్నారు.
నర్సీపట్నంతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు వ్యవహారంలో గంటా తలదూర్చడంతో పాటు ఇన్ని రోజులుగా మిన్నకుండి ఇప్పుడు అంతా తానై వ్యవహరిస్తూ తమను పార్టీకి దూరం చేస్తున్నారని అయ్యన్న మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చివరకు చంద్రబాబు దిగివచ్చి సమీక్ష సందర్భంగా అయ్యన్నకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గంటాను దూరంగా ఉంచారు. ఇదే అదనుగా అనిత కూడా గంటా ఫొటో లేకుండానే తన నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిపై ఆ పార్టీ కాపు నేతలు మండిపడుతున్నప్పటికీ తగ్గేదేలే అని ముందకు వెళుతున్నారు. మొత్తంగా టీడీపీలో ఈ అసమ్మతి వ్యవహారం క్రమంగా అన్ని నియోజకవర్గాలకు పాకుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment