సాక్షి, విశాఖపట్నం : ఇప్పటికే టీడీపీతో పొత్తుపై కత్తులు నూరుతున్న జనసేన శ్రేణులు ఇప్పుడు ఆ పార్టీలో అగ్ర నాయకుల వ్యవహార శైలిపై తీవ్ర అసహనంతో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న తమను కాదని నిన్నగాక మొన్న చేరిన జంప్ జిలానీలకు పెద్దపీట వేస్తున్నారంటూ రగిలిపోతున్నారు. కేవలం డబ్బుకే ప్రాధాన్యమిస్తున్నారు తప్ప పార్టీలో సేవలకు గుర్తింపు లేదంటూ ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కొన్నాళ్ల క్రితం వరకు కొన్ని చోట్ల ఒకింత ఉత్సాహంగా కనిపించిన జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రస్తుత పరిణామాలతో నిర్లిప్తత, నైరాశ్యంతో కనిపిస్తున్నారు.
ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన సోదరుడు నాగబాబుల వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పవన్ సామాజికవర్గానికి చెందిన యలమంచిలి నియోజకవర్గానికి చెందిన సుందరపు విజయకుమార్ గతం నుంచే జనసేనలో ఉన్నారు. అప్పటికే జనసేన సానుభూతిపరుడిగా ఉన్న ఆయన సోదరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పోర్టు కాంట్రాక్టరు సతీష్ పార్టీలో చేరుతున్నారంటూ ఆకస్మికంగా (డిసెంబర్ 7న) పవన్ కల్యాణ్‌తో విశాఖలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇది జనసేన నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత నుంచి అదే సామాజికవర్గానికి చెందిన ‘సుందరపు’ కుటుంబానికి పవన్, నాగబాబులు అధిక ప్రాధాన్యమిస్తున్నారంటూ పార్టీలో చర్చ మొదలైంది.
సతీష్ తాను నాగబాబుకు అత్యంత సన్నిహితునిగా చెప్పుకోవడం, అందుకు తగ్గట్టే నాగబాబు వ్యవహార శైలి ఉండడం పార్టీలో ఇతర నాయకులకు మింగుడు పడడం లేదు. టీడీపీతో పొత్తులో భాగంగా గాజువాక సీటు తమకు ఖరారైందని, ఆ స్థానం నుంచి సతీష్ పోటీ చేయబోతున్నారంటూ కొద్ది రోజుల నుంచి విస్తృత ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి నాగబాబు బరిలో ఉంటారన్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
క్యాడరును పట్టించుకోని పవన్
అధినేత పవన్ విశాఖ వచ్చినప్పుడు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ జనసేన క్యాడరు అసంతృప్తితో ఉంది. ఎవరో ఒకరిద్దరికే కలిసే అవకాశం ఇవ్వడం, హోటల్ గదికే పరిమితమవ్వడం తప్ప మిగతా వారిని దరికి చేరనీయడం లేదని మధన పడుతున్నారు. ప్రజారాజ్యంలోనూ నాగబాబు ఇదే తీరును ప్రదర్శించారని, ఇప్పుడూ అదే జరుగుతోందని వీరు గుర్తు చేస్తున్నారు.
జీర్ణించుకోలేకపోతున్న సీనియర్లు..
మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేస్తున్న వారిని పక్కనబెట్టి పార్టీలు మారి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ జనసేన సీనియర్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే సుందరపు కుటుంబానికిస్తున్న ప్రాధాన్యతపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ నాయకులు తాజా పరిణామాలతో మరింతగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణలు జనసేనలో చేరారు. వీరిలో పంచకర్లకు పెందుర్తి సీటు ఖాయమన్న ప్రచారం చేసుకుంటున్నారు.
దీంతో ఇన్నాళ్లూ ఆ సీటును ఆశిస్తున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌కు మింగుడు పడడం లేదు. అలాగే మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య కూడా విశాఖలో సీటు ఆశిస్తున్నారు. టీడీపీతో పొత్తులో ఆయనకు సీటు దక్కే అవకాశాలు లేకపోవడంతో కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం అక్కడ చాలా ఏళ్లుగా ఇన్‌చార్జిగా ఉన్న పరచూరి భాస్కరరావుకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. టీడీపీతో పొత్తు వల్ల తమకు పోటీ చేసే అవకాశమే లేకుండా పోతోందన్న ఆవేదన ఒకవైపు, తాము కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారన్న బాధ మరో వైపు జనసేన నాయకులను వేధిస్తోంది.
నాగబాబు కుమార్తె సినిమాకు సతీష్ పెట్టుబడి
నాగబాబు కుమార్తె తీస్తున్న ఓ సినిమాకు సతీష్ భారీగా పెట్టుబడి పెట్టారని, అందుకే సతీష్ సోదరులిద్దరికీ పార్టీలో ప్రాధాన్యతనిస్తున్నారని, సతీష్‌కు గాజువాక సీటు దక్కేలా చూస్తున్నారని జనసేన నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పోర్టు కాంట్రాక్టరు కూడా అయిన సతీష్ గాజువాక సీటు నుంచి గెలిస్తే గంగవరం పోర్టుపై పట్టు సాధించవచ్చన్నది వారి వ్యూహంగా ఉందని పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే గాజవాక సీటుపై కోటి ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment