అన్నకే దిక్కులేదు.. మేమెంత? అంటూ నిర్వేదం
విశాఖ దక్షిణ, గాజువాక, భీమిలి ఆశావహుల్లో అలజడి
నాగబాబుకు ఝలక్‌తో పత్తా లేని సుందరపు బ్రదర్స్
ఇప్పటికే జాడలేకుండా పోయిన జనసేన సీనియర్లు
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన శ్రేణుల్లో సరికొత్త అలజడి రేగుతోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తులో అరకొర సీట్ల కేటాయింపు వీరికి మింగుడు పడడంలేదు. చాలీచాలని సీట్లతో ఎవరికి ఎసరు వస్తుందోనని లోలోన ఆందోళన చెందుతు న్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి తానే బరిలో ఉంటున్నానని, అచ్యుతాపురంలో కాపురం కూడా పెట్టి నానా హంగామా చేసిన నాగబాబు.. పక్షం రోజులు తిరక్కుండానే పలాయనం చిత్తగించారు.
ఈ పరిణామానికి జనసేన క్యాడరు షాక్‌కు గురైంది. పవన్ కల్యాణ్ సొంత సోదరునికే ఈ పరిస్థితి వస్తే ఇక మేమెంత? అంటూ పార్టీలో టిక్కెట్లను ఆశిస్తున్న వారు నిర్వేదంలో పడిపోయారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని తేటతెల్లమైంది. నిజంగా జనసేనలో పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా నాగబాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. స్వయంగా అన్నకే పార్టీలో దిక్కు లేదని, ఇక ఆయనను నమ్ముకుంటే తాము నట్టేట మునిగినట్టేనని వాపోతున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో నాగబాబుకు అన్ని విధాలా దన్నుగా నిలిచి, ఆయన వ్యవహారాలు చూస్తున్న యలమంచిలి ప్రాంతానికి చెందిన సుందరపు బ్రదర్స్ (విజయ్‌కుమార్, సతీష్‌కుమార్) సైతం నాగబాబు ఎపిసోడ్‌తో పత్తాలేకుండా పోయారు. వాస్తవానికి వీరిలో విజయకుమార్ యలమంచిలి, సతీష్‌కుమార్ గాజువాక సీట్లను ఆశిస్తున్నారు. ఇందుకోసం వీరు నాగబాబును ప్రసన్నం చేసుకుంటూ అటు అనకాపల్లి జిల్లాలోను, ఇటు విశాఖపట్నం జిల్లాలోనూ వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. నాగబాబు మనుషులుగా ముద్ర వేయించుకున్న వీరు కొంతమంది నుంచి వసూళ్లకు దిగారన్న ఆరోపణలున్నాయి. నాగబాబు తాజా పరిస్థితితో వీరు ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు.
త్యాగాలకు సిద్ధంకండి..
మరోవైపు భీమిలి జనసేన సీటు తనకే ఖాయమైందని బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న పంచకర్ల సందీప్‌కు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ సారి ఈ సీటును త్యాగం చేయాలని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందీప్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే గాజువాక స్థానం నుంచి తమ అభ్యర్థే బరిలో ఉంటారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు విస్తృతం చేశారు. దీంతో అక్కడ జనసేన సీటును ఆశిస్తున్న సుందరపు సతీష్‌కుమార్, కోన తాతారావులు కూడా త్యాగాలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇక జనసేన నుంచి విశాఖ దక్షిణ సీటును వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్, ప్రసాదరెడ్డి, కందుల నాగరాజు, డాక్టర్ మూగి శ్రీనివాసరావులు ఆశిస్తున్నారు. ఈ స్థానం నుంచి కూడా టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారని తెలియడంతో వీరంతా కలవరం చెందుతున్నారు.
ఆ ఇద్దరిలో ఒక్కరికే చాన్స్?
ఇక ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశించి వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌లు జంప్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిలో ఒక్కరికే జనసేన సీటు దక్కవచ్చని చెబుతున్నారు. పెందుర్తి స్థానం పంచకర్లకు దాదాపు ఖరారైందని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే వంశీకృష్ణకు మొండి చెయ్యే గతయ్యే పరిస్థితి తలెత్తనుంది. అదే జరిగితే జనసేన త్యాగరాజుల జాబితాలో ఆయన కూడా చేరిపోనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కీలకనేతలు తమకు గుర్తింపు లేదని, నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలతో ఇప్పటికే జాడలేకుండా పోయారు. ఇప్పుడు వీరికి త్యాగమూర్తులు కూడా తోడయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment