నమ్మించి మోసం చేశారని చంద్రబాబు, లోకేష్‌పై అతని వర్గం ఆగ్రహం
తగరపువలస: భీమిలి ప్రస్తుత తెలుగుదేశం ఇన్‌చార్జి బలిపశువు కాబోతున్నారా? టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వారి అధిష్టానాలు పక్క చూపు లు చూస్తున్నాయా? అంటే.. అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. భీమిలి అసెంబ్లీ టికెట్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజుకు ఖరారు చేసినట్లు వార్త లు రావడంతో ప్రస్తుత ఇన్‌చార్జి కోరాడ రాజబాబు వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి వరకు కోరాడ రాజబాబు అయ్యన్నపాత్రుడితో సమావేశం అయినట్టు తెలిసింది.
భీమిలిని కేటాయించడానికి బంగార్రాజు పార్టీకి రూ.10 కోట్లు, గంటా, అచ్చెన్నాయుడుకు రూ.కోటి వంతున ఇచ్చినట్టు రాజబాబు వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉద యం రాజబాబు వర్గం నగరంలోని ఒక హోటల్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అధినాయకత్వం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగిన యువగళంలో చంద్రబాబు, ఇటీవల మాడుగులలో జరిగిన శంఖారావంలో లోకేష్ రాజబాబుకే టికెట్ ఇస్తామని నమ్మించి ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు భీమిలిలో టికెట్ ఇచ్చేదిలేదని టీడీపీ అధినాయకత్వం తెగేసి చెప్పేసిందని రాజబాబు వర్గం చెబుతోంది. ఇన్నాళ్లూ కష్టపడిన వారిని కాదని కర్రోతు బంగార్రాజును భీమిలికి దిగుమతి చేసుకోవడం దారుణమని వాపోతున్నారు.
ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు గొల్లంగి ఆనందబాబు పత్రికా ప్రకటన ద్వారా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో భీమిలి ఓటర్లకే తెలియని సబ్బం హరిని ఇక్కడ అభ్యర్థిగా నిలపడంతో ఎమ్మెల్యేతో పాటు విశాఖ ఎంపీ స్థానం కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు భీమిలికి చెందిన వారికి కాకుండా పక్క జిల్లాకు చెందిన బంగార్రాజు పేరుతో సర్వే చేయించడం చంద్రబాబు తొందరపాటు చర్యగా భావిస్తున్నారు. అనంతరం గీతం విద్యాసంస్థల అధినేత భరత్‌ను కలిసి.. ఇదే విషయాన్ని హెచ్చరించినట్లు సమాచారం. అలాగే టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడును కలిసేందుకు రాజబాబు వర్గం శ్రీకాకుళం జిల్లాలోని ఆయన ఊరు నిమ్మాడకు వెళ్లారు. తనకంటే చిన్నస్థాయి నాయకుడైన బంగార్రాజును నెల్లిమర్ల నుంచి భీమిలి తీసుకురావడంపై రాజబాబు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.
తాను గత నెల 4వ తేదీ నాటికే డబ్బులు చూపిస్తానని చెప్పినా చంద్రబాబు, లోకేష్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా నెల్లిమర్ల సీటు అక్కడ జనసేన అభ్యర్థి మాధవికి కేటాయించడంతో గుర్రుగా ఉన్న బంగార్రాజును భీమిలి తీసుకువచ్చి సర్వే పేరుతో బలిపశువును చేయడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలిపల్లి లో జరిగిన యువగళంలో రూ.3.50 కోట్ల వరకు ఖర్చు చేసిన బంగార్రాజును ఏమార్చడానికే టీడీపీ–జనసేన ఈ తతంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు భీమిలి టికెట్ జనసేనకు కేటాయించే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment