● ఈ నెలలో కూడా ఎగనామం పెట్టిన కూటమి ప్రభుత్వం ● అసహనం వ
మహారాణిపేట: కూటమి ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అస్తవ్యస్థంగా మారింది. ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం కార్డుదారులకు అందించే కందిపప్పునకు ఈ నెల కూడా ఎగనామం పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. కేవలం బియ్యం, పంచదార మినహా మిగిలిన సరుకుల సరఫరా నోచుకోవడం లేదు. కందిపప్పు సరఫరా కూడా రెండు నెలల ముచ్చటగానే ముగిసింది. ఆ తర్వాత నుంచి కందిపప్పు జాడలేదు. ఈ నెల కూడా కంది పప్పును మాత్రం అడగొద్దని అంటున్నారు. కొన్ని నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోగా మార్చిలోనైనా ఇస్తారని కార్డుదారులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ నెలలో కూడా పంపిణీ చేయలేమని కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నాయకులు బియ్యం కార్డుదారులకు వరాల జల్లు కురిపించారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, నూనె, గోధుమ పిండి, రాగి పిండి తదితర సరుకులు అందజేస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కనీసం దృష్టి సారించలేదు.
చుక్కలు చూపిస్తున్న కందిపప్పు ధర
జిల్లాలో 5,12,619 తెలుపు కార్డుదారులు ఉన్నాయి. వీరి కోసం 625 చౌకధరల డిపోలు ఉన్నాయి. దీని ప్రకారం జిల్లాలోని కార్డుదారుల అవసరాలకు అనుగుణంగా 700 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. అయితే గతేడాదిలో రెండు నెలలు మాత్రమే కందిపప్పులు సరఫరా చేశారు. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు కందిపప్పును రూ.67కు అందించేవారు. కొంత కాలంగా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం, బహిరంగ మార్కెట్లో కేజీ ధర రూ.160 వరకు పలుకుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు కందిపప్పు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పప్పన్నానికి దూరం అవుతున్నారు. వచ్చే నెలలో అయినా కందిపప్పు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment