తప్పుల తడకగా సీనియారిటీ జాబితా | - | Sakshi
Sakshi News home page

తప్పుల తడకగా సీనియారిటీ జాబితా

Published Tue, Mar 11 2025 12:43 AM | Last Updated on Tue, Mar 11 2025 12:42 AM

తప్పుల తడకగా సీనియారిటీ జాబితా

తప్పుల తడకగా సీనియారిటీ జాబితా

● అప్పీళ్లకు ముగిసిన గడువు ● సవరణల కోసం 250 మంది దరఖాస్తు

విశాఖ విద్య: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా లు ప్రకటించేందుకు విద్యాశాఖాధికారులు ఆపసోపాలు పడుతున్నారు. టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(టీఐఎస్‌)లో సమగ్ర వివరాలు నమోదు సమ యంలో ఉపాధ్యాయుల అలసత్వం, డీడీవోల నిర్లక్ష్యంతో జాబితాలు తప్పులతడకగా మారాయి. వీటి ఆధారంగానే త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. దీంతో సీనియారిటీ జాబితా లోపాలను సవరించి, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాకు సర్వీసు విషయాల్లో నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా డీఈవోకు తమ మొర విన్నవించుకునేందుకు ఉపాధ్యాయులు క్యూ కట్టారు. అప్పీళ్లకు సోమ వారం చివరి రోజు కావటంతో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 250 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

అప్పీళ్ల పరిశీలనకు ప్రత్యేక కమిటీ

వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే నిమిత్తం 12 మంది సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ఎంఈవోలతో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతీ దరఖాస్తును వారు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతనే టీఐఎస్‌ లాగిన్‌లో వాటిని సరిచేశారు. ఇలా 210 దరఖాస్తులను సోమవారం నాటికి ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఉపాధ్యాయులు లేవనెత్తిన అంశాలను సరిచేశారు. మరో 40 వరకు దరఖాస్తులు అభ్యంతరాలతో కూడినవి కావటంతో.. మరోసారి క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకున్న తరువాతనే వాటిని సీనియారిటీ జాబితాలో చోటు కల్పించేలా చర్యలు చేపట్టారు.

జాబితాలపై ఉన్నత స్థాయి సమీక్ష

ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు, సవరణల కోరుతూ వచ్చిన అప్పీళ్ల విషయమై సోమవారం విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి డీఈవో ప్రేమ్‌కుమార్‌, సర్వీసు వ్యవహరాలు చూసే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అరుణ జ్యోతి, సంబంధిత సెక్షన్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొని, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

ఆందోళన వద్దు

సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలపై ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్ల వారీగా పూర్తి స్థాయిలో సమగ్ర పరిశీలన చేసిన తరువాతనే తుది జాబితాలను వెల్లడిస్తాం. జాబితాల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఉపాధ్యాయులు నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు.

– ఎన్‌.ప్రేమ్‌కుమార్‌,

నోడల్‌ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement