విశాఖ సిటీ: పురపాలక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త జీవోల ప్రకారం భవన నిర్మాణాలు, లేఅవుట్ల అభివృద్ధి విషయంలో నిబంధనలు పాటించాలని డీటీసీపీవో పి.నాయుడు సూచించారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్‌లో ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలు 3, 4, 5, 20లపై ఎల్‌టీపీలు, ఇంజినీర్లు, ప్లానింగ్ సెక్రటరీలకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జీవోల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు. లేఅవుట్లకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలని నిర్దేశించినట్లు చెప్పారు. యుటిలిటీస్, ఎమినిటీస్ బ్లాక్‌లకు నిర్ధిష్టమైన నిబంధనలు పెట్టారని వెల్లడించారు. ఐదు ఎకరాలలోపు లే అవుట్లలో 40 అడుగుల రహదారి ఒకటి, అంతకు మించిన లేఅవుట్లలో రెండు రహదారులు ఉండాలని వివరించారు. జాతీయ రహదారి, రాష్ట్ర హైవేలకు ఆనుకుని ఉన్న లేఅవుట్ల విషయంలో సంబంధిత అధికారుల నుంచి ఎన్‌వోసీ ఉండాలని స్పష్టం చేశారు. లే అవుట్లలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. నదులకు సమీపంలో అభివృద్ధి చేసే లేఅవుట్ల విషయంలో బఫర్ జోన్ 100 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గించారని తెలిపారు. వీఎంఆర్డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర రావు, డీసీపీలు హరిదాసు, రామ్మోహన్, పీవో మౌనిక, డీటీసీపీ ఆర్డీ పి.నాయుడు, పీసీపీఐఆర్ పీవో చైతన్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment