
గీతాకృష్ణ వ్యాఖ్యలపై మహిళా న్యాయవాదుల నిరసన
సీతమ్మధార: మహిళలపై టాలీవుడ్ దర్శకుడు గీతా కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వుమెన్స్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్(వావా) అధ్యక్షురాలు పప్పు అనురాధ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వావా ఆధ్వర్యంలో గురువారం మహిళా న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గీతాకృష్ణ వివిధ చానల్స్‌లో మహిళలను అసభ్యకరంగా వర్ణిస్తూ వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. అసోసియేషన్ తరఫున అతనిపై పోలీస్ కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని, ఆయన మాట్లాడిన వీడియోలు ఆధారంగా గీతాకృష్ణపై చర్యలు తీసుకోవాలని అనురాధ కోరారు. నిరసనలో అసోసియేషన్ కార్యదర్శి హేమమాలిని, కోశాధికారి బి.రమాదేవి, ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మీదుర్గ, డి.పద్మారాణి, తదితరులు పాల్గొన్నారు.