కష్టజీవులను కబళించిన టిప్పర్
కూర్మన్నపాలెం : విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న ఇద్దరు కార్మికులను టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. స్టీల్ సిటీ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దువ్వాడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. దువ్వాడ ఉప్పర కాలనీకి చెందిన డి.రాంబాబు(45), నక్కా కృష్ణ(43), నక్కా శ్రీను స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులకు హాజరయ్యారు. విధులు ముగించుకొని గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. స్టీల్ సిటీ డిపో ఎదురుగా జాతీయ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా అనకాపల్లి నుంచి గాజువాక వైపు వస్తున్న టిప్పర్ బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రాంబాబు, కృష్ణ చక్రాల కింద నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. బైక్‌పై వెనుక కూర్చున్న నక్కా శ్రీను ఎగిరి పడడంతో గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాంబాబుకు భార్య చంటమ్మ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కృష్ణకు భార్య సింహాచలంతో పాటు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఈ సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గుండెలవిసేలా రోదించారు. కాగా.. ప్రమాదం జరిగే సమయంలో కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు మలుపు తిరుగుతోంది. దానిని కూడా టిప్పర్ ఢీకొని కొంత దూరం ఈడ్చుకు పోయింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. అప్పుడే డిపో నుంచి బయలుదేరడంతో బస్సులో ప్రయాణికులెవరూ లేరు.
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
ఇద్దరు దుర్మరణం.. ఒకరికి గాయాలు
బంధువుల ఆందోళన
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు, కాలనీవాసులు ఘటనా స్థలం వద్ద ఆందోళనకు దిగారు. టిప్పర్ యజమాని ఘటనా స్థలానికి రావాలని, అంతవరకూ మృతదేహాలు తరలించడానికి వీలులేదని పట్టుబట్టారు. రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనాలు నిలిచిపోయాయి.
ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్‌కుమార్ అక్కడకు చేరుకుని, వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగించడంతో.. పోలీసులు టిప్పర్ యాజమాన్య ప్రతినిధులను రప్పించి పోలీస్‌స్టేషన్‌లోనే చర్చలు జరిపారు. ఏసీపీ టి.త్రినాథ్ సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో సవర సంఘం ప్రతినిధులు జి.రాజేష్, నూకరాజు, తాతారావు యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో బంధువులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కష్టజీవులను కబళించిన టిప్పర్