భూముల క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ
మహారాణిపేట: అభ్యంతరం లేని అనధికారిక ఆక్రమణలు, నివాసయోగ్యమైన కట్టడాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 30 ఉద్దేశాలు, ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. 2019కి ముందు జరిగిన ఆక్రమణలను పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం వేర్వేరుగా విశాఖ, భీమిలి రెవెన్యూ డివిజన్లపై సమీక్ష జరిగింది. జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాధుర్, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, సర్వే శాఖ ఏడీ సూర్యారావులతో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులు, పీజీఆర్‌ఎస్ వేదికగా వచ్చిన వినతుల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ప్రజల సంతృప్తే కొలమానంగా రెవెన్యూ సిబ్బంది పనితీరును అంచనా వేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలో పారదర్శకత లోపించకుండా పని చేయాలన్నారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని, ఆక్రమణల వివరాలను ప్రతి సచివాలయంలో ప్రదర్శించాలని ఆదేశించారు. జీవో నంబర్ 301 ప్రకారం గాజువాక పరిధిలోని భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో తహసీల్దార్లు, డీటీలు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
విశాఖ, భీమిలి డివిజన్ల రెవెన్యూ సమీక్షలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం