అప్పన్న పెళ్లికి ముహూర్తం ఖరారు | - | Sakshi
Sakshi News home page

అప్పన్న పెళ్లికి ముహూర్తం ఖరారు

Published Sat, Mar 15 2025 1:14 AM | Last Updated on Sat, Mar 15 2025 1:14 AM

అప్పన

అప్పన్న పెళ్లికి ముహూర్తం ఖరారు

సింహాచలం: సింహాచలంపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వివాహం కోసం శుక్రవారం సింహగిరి నుంచి కొండ దిగువకు వచ్చి న స్వామి.. పిల్లనివ్వమని తన సోదరి, అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారిని కోరారు. ఏం చూసి నీకు పిల్లనివ్వాలని తొలుత నిరాకరించిన అమ్మవారు.. ఆ తర్వాత స్వామి వైభవాన్ని, ఆయనకున్న అసంఖ్యాకమైన భక్తజనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చివరకు పిల్లనివ్వడానికి అమ్మవారు అంగీకరించారు. దీంతో ఈ నెల 30న ఉగాది రోజు పెళ్లిరాట ఉత్సవం, వచ్చే నెల 8వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సింహగిరిపై పెళ్లి సందడి నెలకొంది.

ఘనంగా డోలోత్సవం

ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి డోలోత్సవం ఘనంగా జరిగింది. ఏటా చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామికి జరిగే వార్షిక కల్యాణోత్సవానికి ముందు వచ్చే ఫాల్గుణ పౌర్ణమి రోజు అడవివరంలో స్వామికి డోలోత్సవం విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. తనకు పిల్లనివ్వాలంటూ తన సోదరి అయిన పైడితల్లి అమ్మవారిని స్వామి అర్ధించే విధానాన్నే అడవివరం గ్రామస్తులు బొట్టెనడిగే పున్నమి ఉత్సవం(డోలోత్సవం)గా అభివర్ణిస్తారు. కాగా.. కొండదిగువ పుష్కరిణి ఉద్యానవన మండపంలో ఈ ఉత్సవాన్ని దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామి ని విశేషంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహగిరిపై నుంచి పల్లకీలో మెట్లమార్గం ద్వారా తొలిపావంచా వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్వామికి దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, అధికారులు, గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామిని ఊరేగింపుగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ స్వామికి గ్రామస్తులు విశేషంగా హారతులు పట్టారు.

అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి ఉద్యానవన మండపంలో ఏర్పాటు చేసిన డోలీపై అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. చూర్ణోత్సవం, వసంతోత్సం నిర్వహించారు. పూజలు చేసిన వసంతాలను స్వామికి సమర్పించారు. అనంతరం నాళాయిర దివ్య ప్రబంధాన్ని ఆలపిస్తూ డోలోత్సవం నిర్వహించారు. తదుపరి స్వామికి సమర్పించిన వసంతాలను అర్చకులు భక్తులపై చల్లారు. స్వామి కి పెళ్లికుదిరిన ఆనందంలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు ఒకరిపై ఒకరు వసంతాలను జల్లుకుని ఆనంద డోలికల్లో మునిగితేలారు. అనంతరం భక్తులకు పానకాన్ని ప్రసాదంగా అందజేశారు. తర్వాత అడవివరంలో తిరువీధి నిర్వహించారు. పెళ్లి కొడుకు అలంకరణలో తమ ఇంటి ముందుకు వచ్చిన స్వామికి గ్రామస్తులు మంగళ హారతులిచ్చా రు. తదుపరి స్వామిని మరల పైడితల్లి ఆలయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి సింహగిరికి చేర్చారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, డిప్యూటీ ఈవో రాధ తదితరులు స్వామిని దర్శించుకున్నారు.

ఈ నెల 30న ఉగాది రోజు పెళ్లిరాట

ఏప్రిల్‌ 8న వార్షిక కల్యాణోత్సవం

ఉద్యానవన మండపంలోఘనంగా డోలోత్సవం

శాస్త్రోక్తంగా వసంతాల సమర్పణ

అప్పన్న పెళ్లికి ముహూర్తం ఖరారు 1
1/1

అప్పన్న పెళ్లికి ముహూర్తం ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement