
సొంత గనుల కోసం కార్మికుల పోరాటం
సీతమ్మధార: స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం మహా ధర్నా చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గురజాడ అప్పారావు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, గాజువాకలో తలపెట్టిన ధర్నాకు పోలీసులు అడ్డుపడి నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తొలగించిన సుమారు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌లోని ఆఫీసర్లు, శాశ్వత ఉద్యోగులకు మూడు నెలల బకాయి జీతాలు విడుదల చేయాలని, స్టీల్‌ప్లాంట్ క్వార్టర్లలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఉద్యమాలు నిర్వహిస్తున్న స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ నాయకుడు జె.అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాయకులు వై.రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, పి.మణి, కె.ఎం.కుమార మంగళం, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, ఐఎన్‌టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగవిల్లి నాగభూషణం, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు ఎస్.కె.రెహమాన్, జె.డి.నాయుడు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహా ధర్నా, మానవహారం