
ముగ్గురి మధ్య ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు
కూర్మన్నపాలెం: గాజువాక శివారు 77వ వార్డు మద్దివానిపాలెంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ప్రస్తుతం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి.. మద్దివానిపాలేనికి చెందిన వివాహిత మద్ది వెంకటలక్ష్మిని అదే గ్రామానికి చెందిన కర్రి సతీష్‌రెడ్డి కొంత కాలంగా వేధిస్తున్నాడనే పుకార్లు గ్రామంలో వ్యాపించాయి. వెంకటలక్ష్మి భర్త పైడి రెడ్డి విదేశాల నుంచి ఇటీవల తిరిగి వచ్చాడు. ఆనోట.. ఈనోట ఈ విషయం విన్న పైడి రెడ్డి.. వరసకు తమ్ముడైన మద్ది అప్పలరాజు (రాజు)కు తెలియజేశాడు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామంలో సతీష్ రెడ్డిని రాజు నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది కొట్లాటకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న సతీష్‌రెడ్డి తమ్ముడు ఏకాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశంతో ఊగిపోయిన రాజు, తన వద్ద ఉన్న కత్తితో ఏకాంత్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఏకాంత్ రెడ్డి తల, చేయి, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఏకాంత్ రెడ్డి చికిత్స పొందుతున్నాడని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి రాజును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా.. అనుమానం ఎంతటి ఘోరానికై నా దారి తీస్తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని స్థానికులు చర్చించుకున్నారు.