
జూ పార్కులో రాప్టర్ల ప్రదర్శన ప్రారంభం
ఆరిలోవ: పర్యావరణ పరిరక్షణలో రాప్టర్ల(గెద్ద జాతి) పాత్ర ఎంతో కీలకమని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ శాంతిప్రియ అన్నారు. ఇందిరాగాంధీ జూ పార్కులో డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా వింగ్ ఆఫ్ వండర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాప్టర్స్ ఎగ్జిబిషన్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతి ప్రియ మాట్లాడుతూ రాప్టర్లు మాంసాహార పక్షులని, ఇవి ఎలుకలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయని చెప్పారు. అంతేకాకుండా, చనిపోయిన జంతువుల కళేబరాలను తొలగించడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయని వివరించారు. విద్యార్థులు రాప్టర్ల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. 90 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో రాప్టర్ల చిత్రపటాలు, వాటికి సంబంధించిన సమాచార బోర్డులు ఏర్పాటు చేశారు. జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాల నాయుడు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా వింగ్ ఆఫ్ వండర్ ప్రతినిధులు పాల్గొన్నారు.