మన్యంలో చిన్నారుల మృత్యు ఘోష | - | Sakshi
Sakshi News home page

మన్యంలో చిన్నారుల మృత్యు ఘోష

Published Sun, Mar 16 2025 1:14 AM | Last Updated on Sun, Mar 16 2025 1:14 AM

మన్యంలో చిన్నారుల మృత్యు ఘోష

మన్యంలో చిన్నారుల మృత్యు ఘోష

● అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది గైర్హాజరుపై జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆగ్రహం ● నోటీసులు జారీ చేయాలని సీఈవోకు ఆదేశం ● కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైనా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంపై సభ్యుల ఆగ్రహం ● వాడీవేడిగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు

మహారాణిపేట: కీలకమైన జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఏజెన్సీలో వైద్య సదుపాయాలపై, పిల్లల మరణాలపై చర్చ జరిగింది. కానీ సమాధానం చెప్పడానికి అధికారులే లేరు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నోటీసులు జారీ చేయాలని చైర్‌పర్సన్‌ సీఈవోను ఆదేశించారు. తొలుత అరకు జెడ్పీటీసీ చెట్టి రోష్ని మాట్లాడుతూ అరకు మండలం బస్కి గ్రామంలో పిల్లలు ఆకస్మికంగా మృతి చెందారని, ఈ విషయం గురించి మాట్లాడడానికి తాను హెల్త్‌ సబ్‌ సెంటర్‌కు కాల్‌ చేసినా ఎవరూ ఫోన్‌ ఎత్తడం లేదన్నారు. పలు వైద్య ఆరోగ్యశాఖ సబ్‌ సెంటర్లకు వైద్యులు రావడం లేదని, వారిని అడిగే నాథులే లేరని ఆమె వాపోయారు. గిన్నెల, మాడగూడ తదితర ప్రాంతాల్లో చిన్న పిల్లలు వరుసగా చనిపోయారని, కారణం తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరణ ఇవ్వాలని చైర్‌పర్సన్‌ జె.సుభద్ర కోరారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక్క అధికారి కూడా రాలేదని, జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు రాని అధికారులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆమె సీఈవోను ఆదేశించారు. గిరిజన ప్రజలను మన్యం నుంచి కేజీహెచ్‌కు తరలించడానికి 108 అంబులెన్సు అవసరం ఉంటుందని, కానీ ఫోన్‌ చేసినా 108 అంబులెన్సులు రావడం లేదని చైరపర్సన్‌ అన్నారు.

పింఛన్ల మీద వివక్ష : కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారన్నారు. అలా గే అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలు అవుతున్నా ఎక్కడా కొత్త పింఛన్లు ఇవ్వలేదని, ఇది అన్యాయమన్నారు.

జెడ్పీటీసీ సభ్యులను పట్టించుకోని హౌసింగ్‌ అధికారులు

హౌసింగ్‌ అధికారులు జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులను పట్టించుకోవడం లేదని పలువురు చైర్‌పర్సన్‌ దృష్టికి తెచ్చారు. తమ మండలాల్లో గృహ నిర్మాణ అధికారులు సర్వే చేస్తున్న సమయంలో, కొత్త పేర్ల నమోదు చేసేటప్పుడు తమను సంప్రదించడం లేదని, దీనివల్ల స్థానికంగా తాము ఇబ్బంది పడుతున్నామని, గతంలో ఎప్పుడూ ఇలా లేదని వారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్‌ కోరారు.

పోస్టుమార్టంలో జాప్యం

కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహణలో జాప్యంపై చైర్‌పర్సన్‌తోపాటు పలువురు జెడ్పీటీసీలు ప్రశ్నించారు. మార్చురీ వద్ద అనధికారికంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కువగా గిరిజన ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎందుకు జాప్యం జరుగుతోందని చైర్‌పర్సన్‌ సుభద్ర ప్రశ్నించారు. దీనికి కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శివానంద్‌ బదులిస్తూ.. రోడ్డు ప్రమాదాల్లో మృతులకు పోస్టుమార్టం జరిగే ముందు పోలీసులు శవ పంచనామా నిర్వహించాలని, ఇందులో జాప్యం జరిగితే అన్నీ ఆలస్యం అవుతాయన్నారు. పాయరావుపేట నుంచి అనకాపల్లి వరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, అందువల్ల అనకాపల్లిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ కోరారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్‌ సీఈవో పి.నారాయణమూర్తితోపాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement