
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తరిమేద్దాం
తాటిచెట్లపాలెం: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నగరం నుంచి తరిమివేయాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి పిలుపునిచ్చారు. రైల్వే న్యూకాలనీలోని సుబ్బలక్ష్మీ కల్యాణ మండపంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ తదితరులతో కలిసి ఆమె స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించి, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసి.. నగర పరిశుభ్రతకు పాటుపడాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను వాడి క్యాన్సర్ బారిన పడొద్దని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్లే కలిగే నష్టాలను డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర లేదా నార సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ, ఆర్.సోమనారాయణ, కార్పొరేటర్లు ఉషశ్రీ, రాజశేఖర్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
మేయర్ హరివెంకటకుమారి పిలుపు