
నేల నుంచి నీటిలోకి..
సముద్రంలోకి ఆలీవ్ రిడ్లే తాబేలు పిల్లలు
కొమ్మాది: బుల్లి ఆలివ్ రిడ్లే తాబేళ్లు బుడిబుడి అడుగులు వేసుకుంటూ తమ సహజ ఆవాసమైన సముద్రంలోకి చేరుకున్నాయి. ఈ మనోహరమైన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయపాలెం ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లను అటవీ శాఖ అధికారులు సేకరించి సాగర్‌నగర్‌లోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షించారు. వీటి నుంచి వచ్చిన పిల్లలను డీఎఫ్‌వో శ్రీవాణి శనివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోడుగుళ్లపాలెం నుంచి పెదనాగమయపాలెం వరకు మొత్తం 57,372 గుడ్లను సేకరించి సంరక్షించినట్లు తెలిపారు. తొలి దశలో శనివారం ఉదయం 237 తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ విడతల వారీగా మరిన్ని తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని ఆమె వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.