ఆర్ట్ వర్క్ టీచర్లను రెగ్యులర్ చేయాలి
కంచరపాలెం : సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో గత 14 ఏళ్లగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ట్ వర్క్ ఎడ్యుకేషన్ టీచర్లను రెగ్యులర్ చేయాలని, ఎంటీఎస్ వర్తింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్క్స్ ఆర్క్ ఇన్‌స్ట్రక్టర్స్ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ముఖ్యఅతిథులుగా మాట్లాడారు. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన నాయకులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో రాష్ట్రంలో మొత్తం సుమారు 5,800 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 460 మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఒకేషనల్ ఉపాధ్యాయులుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలు సైకం శివకుమారిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్ భాగవతులు, విశాఖ అధ్యక్షుడు బి.రవిచంద్, జిల్లా అసోసియేషన్ చైర్మన్ త్రినాథరావు, కె.ఎస్.రావు, ఎన్ నాగరాజు, పాడి పంతులు, ఎస్.రామచంద్రరావు, వరప్రసాదరావు, పేరూరి శ్రీనివాసరావు, మెట్ట భారతి పాల్గొన్నారు.