
ఎట్టకేలకు కదలిక.!
● ఆరు లేన్ల రహదారి నిర్మాణ పనులు షురూ.. ● షీలానగర్ నుంచి సబ్బవరం వరకు 12.66 కి.మీ మేర రహదారి ● 2023లో రూ.554.64 కోట్లతో వర్క్ ఆర్డర్ ● ప్రస్తుతం రూ.963 కోట్లకు చేరుకున్న ప్రాజెక్టు వ్యయం
రూ.400 కోట్ల
అదనపు వ్యయంతో..
2023లో వర్క్ ఆర్డర్ ఇచ్చిన సమయంలో రూ.554.64 కోట్లకు ప్రాజెక్టు ఖరీదుగా నిర్ణయించారు. అయితే డిజైన్లలో మార్పులు, ఆర్‌వోబీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం అదనంగా కొన్ని చోట్ల చేర్చి తుది డీపీఆర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.963.93 కోట్లకు చేరుకుంది. విశాఖపట్నం జిల్లాలో ఆరు లేన్ల యాక్సెస్–కంట్రోల్డ్ హైవే నిర్మాణం కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ.963.93 కోట్లు మంజూరు చేసింది.
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు రోడ్డును కలుపుతూ షీలానగర్ జంక్షన్ నుంచి సబ్బవరం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నుంచి ఈ ప్రాజెక్టు పలుమార్లు తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు 2023లో ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచి ఖరారు చేశారు. ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో రూ.554.64 కోట్లతో పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే రహదారి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, మ్యాపింగ్ ఆలస్యమవ్వడం.. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో.. ప్రాజెక్టు వర్క్ ఆర్డర్లు అందించే దశలోనే నిలిచిపోయింది. రెండేళ్ల తర్వాత ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమైంది.
ట్రాఫిక్ అంతరాయాలు తొలగించేలా..
అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారి–16 కారిడార్, ఎన్‌హెచ్–516సీ లోని షీలానగర్ జంక్షన్ మధ్య కనెక్టివిటీని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 12.66 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ హైవే సబ్బవరం గ్రామంలోని తూర్పు వైపున ప్రారంభమై, ప్రస్తుత పోర్ట్ రోడ్డులోని షీలానగర్ జంక్షన్‌లోని గెయిల్ కార్యాలయం సమీపం వరకూ 6 లైన్ల రహదారిగా రూపుదిద్దుకోనుంది. షీలానగర్ జంక్షన్ నుంచి పెదగాడి, నరవ, జెర్రిపోతులపాలెం, చింతగట్ల మీదుగా సబ్బవరం సమీపంలో జాతీయ రహదారికి ఈ రోడ్డు అనుసంధానం కానుంది. రెండు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ కారిడార్ ఏర్పాటైతే విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అదేవిధంగా షీలానగర్–ఆనందపురం ట్రాఫిక్‌ను సమర్థవంతంగా విభజించవచ్చు. దీని వల్ల సరకు రవాణా సులువవుతుంది. విశాఖపట్నం పోర్ట్‌కు కనెక్టివిటీ గణనీయంగా పెరిగి.. పోర్టు లాజిస్టికల్ సామర్థ్యం మెరుగుపడుతుందని విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) అధికారులు చెబుతున్నారు. రెండుమూడేళ్లలో ఈ ఆరులైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.