కుట్రలకు కేరాఫ్ చంద్రబాబు
వెన్నుపోటు రాజకీయాలు.. అరాచక పాలన
● తమ కార్పొరేటర్లకు అధికారులతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారు ● ప్రలోభాలతో సిగ్గు లేని రాజకీయాలకు తెరతీస్తున్నారు.. ● వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ● బెదిరింపులు సహించం: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు, కుతంత్రాలేనని.. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లకు అధికారులతో ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు, సమన్వయకర్తలతో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్‌తో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీలకు బలం లేకున్నా మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొంతమంది కార్పొరేటర్లను టీడీపీలోకి చేర్చుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్ సీపీ అంటే అభిమానంతో ఉన్న కార్పొరేటర్లు భయపడేది లేదని, మేయర్ పీఠాన్ని తప్పకుండా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం దగా
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగా మరోసారి బయట పడిందని ఆయన అన్నారు. ప్యాకేజీ ఇచ్చాం, ప్రైవేటీకరణ అంశమే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ప్రకటనలు తప్పని కేంద్ర ఆర్థిక శాఖ అనుబంధంగా ఉండే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్(దీపం) ఇచ్చిన సమాధానంతో బట్టబయలైందని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేది లేదని దీపం రాసిన లేఖతో కూటమి నేతల నాటకాలు అందరికీ తెలుస్తున్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ తీసుకొచ్చి ప్రైవేటీకరణను తామే ఆపించామని చెబుతున్న కూటమి నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, రాష్ట్ర సంపదను దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందన్నారు.
తలొగ్గకుంటే కేసులు పెడతారంట?
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని, తలొగ్గకపోతే కేసులు పెడతామని భయపెడుతున్నారన్నారు. ప్రలోభాలతో తమ పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు కార్పొరేటర్లను చేర్చుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కార్పొరేటర్లకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్తులో అసలైన రాజకీయం వారికి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దేవన్‌రెడ్డి, జీవీఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.