సబ్బవరంలో భారీగా గంజాయి స్వాధీనం
● ఏవోబీ నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తుండగా పట్టివేత ● రూ.18.19 లక్షల విలువైన 363.8 కిలోల గంజాయి స్వాధీనం ● 2 కార్లు, ఐదు మొబైళ్లు, రూ.50 వేలు నగదు సీజ్ ● ఏడుగురి అరెస్ట్, ముగ్గురు పరారీ
సబ్బవరం: మండలంలోని ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై బాటజంగాలపాలెం టోల్‌గేట్ వద్ద కారులో పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ పిన్నింటి రమణతో కలిసి డీఎస్పీ వళ్లెం విష్ణుస్వరూప్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌లో ఏజెన్సీ ప్రాంతం నుంచి మహరాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.18.19 లక్షల విలువ చేసే 363.8 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సీఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సింహాచలం తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న కారుతో పాటు పైలెట్ వాహనంగా వస్తున్న మరో కారును తనిఖీ చేసి, గంజాయిని పట్టుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు. 7గురిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారైనట్లు తెలిపారు. వారి నుంచి రూ.50 వేలు నగదు, 5 సెల్‌ఫోన్లతో కలిపి ఈ కేసులో మొత్తం రూ.57.10 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఏవోబీ బోర్డర్‌లో కోనుగోలుచేసి చింతపల్లిలో లోడ్‌చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. గంజాయి తరలింపులో వినియోగించిన వాహనాలు తప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్నాయని, వీటిపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఏఎస్‌ఆర్ జిల్లాకు చెందిన వారు ఆరుగురు, ఒడిశాకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఏ1గా సామిరెడ్డి విజయ్(31), ఏ2 వంతల హరీష్‌బాబు(30), ఏ3 మాడబత్తుల అరుణ్‌కుమార్(38), ఏ4 సాగర్ శివాజీ గోపనీ(32), ఏ5 కొర్రా మహేష్‌బాబు(32), ఏ6 ఎన్.రమణ(40), ఏ7గా సరమంద అనిల్‌కుమార్(25)లపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పిన్నింటి రమణ, ఎస్‌ఐలు సింహాచలం, టి.దివ్య తదితరులు పాల్గొన్నారు.