కనీస పెన్షన్ రూ.5 వేలకుపెంచాలని పెన్షనర్ల ఆందోళన
సీతమ్మధార: కనీస పెన్షన్ రూ.5 వేలు అమలు చేయాలని ఈపీఎస్ 95 పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(బీఎంఎస్ అనుబంధం) రాష్ట్ర కన్వీనర్ ఐ.ముత్యాలు డిమాండ్ చేశారు. ఈపీఎస్ పెన్షన్‌కు డీఏ కలపాలని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సౌకర్యం అందించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ల ద్వారా ప్రధానికి వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. 1995లో ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్‌ను సవరించి ఈపీఎస్ 95 పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కనీస పెన్షన్ అమలు కాలేదని, తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ్ కృషితో 2014 నుంచి కనీస పెన్షన్ రూ.1000కి పెంచారన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో కనీస పింఛన్ రూ.5 వేలకు పెంచడంతో పాటు డీఏ జోడించి ఇవ్వాలని కోరారు. యూనియన్ నాయకులు, అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు.