వేయి కనులు చాలవులే..
కొమ్మాది: రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. సాగరానికి అభిముఖంగా ఎత్తైన కొండపై కొలువుదీరిన ఈ ఆలయం ఉత్తరాంధ్ర తిరుపతిగా పేరుగాంచింది. ఇక్కడికి వచ్చే భక్తులు ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకున్న అనుభూతిని పొందుతున్నారని చెబుతున్నారు. పచ్చని కొండలు, విశాలమైన సముద్ర తీరం మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. యాంత్రిక జీవనంతో అలసిపోయిన వారికి ఈ ప్రదేశం ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తోంది. ఈ ఉత్తరాంధ్ర వైకుంఠధామంలో ఈ నెల 20న తృతీయ వార్షికోత్సవం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
అణువణువునా అద్భుతమే..
శ్రీ వారి ఆలయం అణువణువునా ఓ అద్భుతమే. కనుచూపు మేర పరుచుకున్న ప్రకృతి అందాల మధ్య 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. 1.5 ఎకరాల్లో ప్రధాన ఆలయం ఉంటుంది. కొండపైకి రోడ్డుమార్గం సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డుకిరువైపులా పూల మొక్కలు, శ్రీ వారి నామాలతో అలంకరించిన పూల కుండీలు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక శోభ, శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా నిర్మించిన ఈ శ్రీవారి ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు.
భక్తులకు సువర్ణావకాశం
శ్రీవారి ఆలయంలో ప్రతి నెలా శ్రవణ నక్షత్రం సందర్భంగా స్నపన తిరుమంజనం, ప్రతీ శుక్రవారం వారాభిషేకంలో భాగంగా శ్రీవారికి మేల్చాట్ వస్త్రం ధరింపజేస్తున్నారు. భక్తులు నేరుగా శ్రీవారికి మేల్చాట్ వస్త్రాన్ని అందించే అవకాశం ఉంది. ఈ వస్త్రం ధర రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుంది. ఏటా వైకుంఠ ఏకాదశి, ఉగాది, బ్రహ్మోత్సవాల ముందు మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయిస్తున్నారు. ప్రతి శనివారం కోలాటాలు, శ్రీవారి నామ సంకీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాలు జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిత్యం అన్నప్రసాదాల పంపిణీ జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో శ్రీవారి సేవకు వస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని చేరుకునేందుకు కొండపైకి ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆటోలకు అనుమతి లేదు. కొండ చిన్నది కావడంతో భక్తులు నడిచి ఆలయాన్ని చేరుకోవచ్చు. కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది. రాత్రి 7.45 గంటల వరకు మాత్రమే స్వామి దర్శనానికి భక్తులు అనుమతి కలదు.
వేడుకలు ఇలా..
ఈ నెల 20న శ్రీవారి ఆలయ తృతీయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు తెలిపారు. ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు సుప్రభాతం, 5.30 నుంచి 7 గంటల వరకు తోమాల సహస్ర నామార్చన, మొదటి గంట నిర్వహించి 7 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. ఆ రోజు ప్రత్యేకంగా భగవత్ అనూజ్ఞ, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, హోమం, ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శత కలశ స్నపనం, పూర్ణాహుతి, అక్షతారోపణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మాఢ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఈవో తెలిపారు.
ఉత్తరాంధ్ర తిరుపతిగా పేరుగాంచిన
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం
నిత్యం శ్రీవారిని దర్శించుకుంటున్న
వేలాది మంది భక్తులు
రేపు ఆలయ తృతీయ వార్షికోత్సవం
ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
శ్రీవారి సేవలివీ
సేవ వివరాలు భక్తుల సమయం టికెట్ ధర
సంఖ్య
సుప్రభాతం 1 ఉ. 6 గంటలు 100
పుష్పవిరాళం 4 ఉ. 8 గంటలు 12,000
తోమాల సేవ 1 ఉ. 8 గంటలు 200
సహస్ర నామార్చన 1 ఉ. 8.30 గంటలు 200
అర్చన 1 ఉ. 9.30 నుంచి
సా.7.30 గంటలు 100
మేల్చాట్ వస్త్రం 4 ఉ. 6.30 గంటలు 30,150
అభిషేకం(శుక్ర) 1 ఉ. 6.30 గంటలు 250
ఏకాంత సేవ 1 రాత్రి 8 గంటలు 100
వేదాశీర్వాదం 4 ఉ. 10 నుంచి
సా.6 గంటలు 1,500
భోగం విరాళం 4 – 10,000
వేయి కనులు చాలవులే..