కై లాసగిరిపై భద్రత ప్రశ్నార్థకం
ఆరిలోవ: నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కై లాసగిరిలో పర్యాటకుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి వచ్చే విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షించే కై లాసగిరిపై నిర్వహిస్తున్న సర్క్యూట్ ట్రైన్(విశాఖ దర్శిని టాయ్ ట్రైన్) సోమవారం పట్టాలు తప్పింది. సందర్శకులను తీసుకువెళుతుండగా తెలుగు మ్యూజియం ఎదురుగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ట్రైన్ సుమారు 200 మీటర్ల దూరం ట్రాక్‌పై దూసుకుపోవడంతో ట్రాక్, ఇరువైపులా రోడ్డు కొంతమేర దెబ్బతిన్నాయి. వారం రోజుల కిందట కై లాసగిరిలోని రోప్‌వే వద్ద అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సర్క్యూట్ ట్రైన్ పట్టాలు తప్పడంతో వీఎంఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా యని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్ మొరాయించడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. నెల రోజుల కిందటే మరమ్మతులకు గురి కాగా ఈ ట్రైన్‌ను నడపకుండా వీఎంఆర్డీఏ అధికారులు నిలిపివేశారు. దీని ఇంజిన్‌లో కొన్ని భాగాలు పాడవడం, జనరేటర్ పనిచేయకపోవడం, ఏసీ, ఫ్యాన్లు పాడవడంతో మరమ్మతులు చేస్తామంటూ కై లాసగిరి స్టేషన్‌లో ఓ బోర్డు ఏర్పాటు చేశారు. నిలిపివేసిన మూడు వారాల తర్వాత మళ్లీ ట్రైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ అదే పరిస్థితి తలెత్తడం గమనార్హం. సేవలు ప్రారంభించిన వారం రోజులకే ట్రైన్ పట్టాలు తప్పడం ఆందోళన కలిగిస్తోంది. ట్రైన్‌లో మరమ్మతులు పూర్తి కాకుండానే తిప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ట్రైన్ చక్రాలు పూర్తిగా అరిగిపోయాయని, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని తెలుస్తోంది. అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరమ్మతులు చేస్తున్నట్లుగా పాత బోర్డునే మళ్లీ ఏర్పాటు చేసి పర్యాటకులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. నగరంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతం పట్ల అధికారులు చూపుతున్న నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీఎంఆర్డీఏ తక్షణమే స్పందించి కై లాసగిరిలోని పర్యాటక సౌకర్యాల నిర్వహణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
పట్టాలు తప్పిన సర్క్యూట్ ట్రైన్
ఇటీవలే రోప్‌వే వద్ద అగ్ని ప్రమాదం
వరుస ప్రమాదాలతో పర్యాటకుల్లో ఆందోళన
కై లాసగిరిపై భద్రత ప్రశ్నార్థకం