ఆదివాసీలపై దమనకాండను ఆపాలి
సీతంపేట: దేశంలో అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ప్రముఖ సామాజిక వేత్త, ఆచార్య జి.హరగోపాల్ అన్నారు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, అభివృద్ధిలో సమానత్వం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో అభివృద్ధి పేరుతో అణచివేత జరుగుతోందని ఆరోపించారు. ఎవరు వ్యతిరేకించినా రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రకటించారని.. బస్తర్ ప్రాంతంలో పోలీస్ క్యాంపుల వెనుక అక్కడి ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఆ మేరకు ఆదివాసీల వ్యతిరేకతతో వేదాంత కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందని గుర్తు చేశారు. మావోయిస్టుల ఏరివేత వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమేనన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు వి.ఎస్.కృష్ణ మాట్లాడుతూ మావోయిస్టు ఉద్యమాన్ని రాజకీయంగా పరిష్కరించే దృష్టి ప్రభుత్వాలకు లేదన్నారు. ప్రజల హక్కులకు లోబడి మావోయిస్టులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, దీనికి విరుద్ధంగా బూటకపు ఎన్‌కౌంటర్లు, గ్రామాలను ధ్వంసం చేయడం, లైంగిక దాడులు, వ్యక్తుల అదృశ్యం వంటి చర్యలకు పాల్పడుతూ ఉద్యమాన్ని క్రిమినలైజ్ చేశారని విమర్శించా రు. హక్కుల సంఘాల పోరాటంతో 2011లో కోర్టు సల్వాజుడుం రాజ్యాంగ విరుద్ధమని ఇచ్చిన తీర్పు తో దానిని రద్దు చేశారన్నారు. ఆ తర్వాత గ్రీన్‌హంట్, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా, పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తూ వనరుల దోపిడీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సదస్సులో పర్యావరణవేత్త గంజివరపు శ్రీనివాస్, ఆదివాసీ హక్కుల నేత రామారావు దొర, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, న్యాయవాది వృద్ధుల కల్యాణ రామా రావు, వామపక్ష నేతలు ఎం.పైడిరాజు, వై.కొండయ్య, డి.లలిత, ఎ.విమల, పద్మ, ఎం. లక్ష్మి, ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్