సాంకేతిక కారణాలతో ఆర్‌ఆర్‌బీ పరీక్ష రద్దు
పెందుర్తి: ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆర్‌ఆర్‌బీ(లోకో పైలట్) అభ్యర్థులు పరీక్ష రద్దుతో తీవ్ర నిరాశ చెందారు. చినముషిడివాడలోని ఐయాన్ డిజిటల్ కేంద్రంలో బుధవారం జరగాల్సిన ఆన్‌లైన్ పరీక్ష ఆఖరి క్షణంలో రద్దయింది. పరీక్షకు అంతా సిద్ధమని తొలుత నిర్వాహకులు ప్రకటించారు. అభ్యర్థులు లోపలికి వెళ్లగానే సర్వర్ డౌన్.. క్షణాలు.. నిమిషాలు.. గంటలు గడుస్తున్నా ఆ సాంకేతిక సమస్య పరిష్కారం కాలేదు. రైల్వే సర్వర్ పనిచేయకపోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచిచూసిన నిర్వాహకులు పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే దాదాపు 1300 మంది అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. మళ్లీ ఎప్పుడు పరీక్ష ఉంటుందో నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం లేదు.