ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
విశాఖ స్పోర్ట్స్: విశాఖలోని డా.వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ నెల 24, 30 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ బుధవారం సమీక్ష జరిపారు. వివిధ విభాగాల అధికారులతో మాట్లాడుతూ సమన్వయ లోపానికి తావీయకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారుల బస, రవాణా, బందోబస్తు తదితర ఏర్పాట్లపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రేక్షకులకు అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సమీక్షలో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, డీసీపీలు, ఏసీఏ, ఢిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్ ప్రతినిధులతో పాటు జీవీఎంసీ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.