సీఐఐ చైర్మన్‌గా మురళీకృష్ణ
ఏయూక్యాంపస్: కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీ(సీఐఐ) ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన చైర్మన్‌గా ఫ్లంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ సీఈవో గన్నమనేని మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఆయన మహాత్మా గాంధీ కాన్సర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ వి.మురళీకృష్ణ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఎపెక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.నరేంద్ర కుమార్ సీఐఐ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సీఐఐ వార్షిక సమావేశం ముగింపులో స్వర్ణాంధ్ర ప్రదేశ్–విజన్ 2047 అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. సీఐఐ పనితీరు, పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాలను అభినందించారు. భారత విదేశాంగశాఖ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ పి.ఎస్ గంగాధర్ వాణిజ్యం పెంచడంలో ఉన్న వ్యూహత్మక ప్రయోజనాన్ని వివరించారు. సీఐఐ ఇండియా 100 కౌన్సిల్ రాజన్ నవాని మాట్లాడుతూ యువత శక్తి, ఆవిష్కరణల నుంచి ప్రేరణ పొందుతున్న విధానం గురించి వివరించారు. బోయింగ్ ఇండియా దక్షిణాసియా సీఎస్‌ఆర్ హెడ్ ప్రవీణ యాగ్నంభట్ మాట్లాడుతూ యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని, విద్య, నైపుణ్యాల మధ్య వ్యత్యాసాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సీఐఐ పూర్వ చైర్మన్ సురేష్ రాముడు చిట్టూరి మాట్లాడుతూ ఏఐ వల్ల విద్యా రంగంలో జరిగే మార్పులు, ఏఐని కరికులంలో భాగం చేయడం తదితర అంశాలపై ప్రసంగించారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ రియర్ అడ్మిరల్ ఆర్.ఎస్ ధలివాల్ దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న వృద్ధిని వివరించారు. వార్షిక సమావేశంలో భాగంగా సీఐఐ ఏపీ పరిశ్రమల భద్రత ఎక్స్‌లెన్స్ 2024 అవార్డులను ప్రదానం చేశారు. 59 సంస్థలకు రాష్ట్ర ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ అందజేశారు. సీఐఐ ఏపీ కై జెన్ పోటీల విజేతలకు తొలిసారిగా అవార్డులను ప్రదానం చేశారు.