ముడసర్లోవ పార్కులో అగ్ని ప్రమాదం
ఆరిలోవ: జీవీఎంసీ 13వ వార్డు పరిధిలోని ముడసర్లోవ పార్కులో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు వ్యాపించడంతో సందర్శకులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనచోదకులు ఆందోళన చెందారు. పార్కులో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చి, అక్కడే ఉన్న ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అనంతరం చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. ఈ ప్రమాదం కారణంగా పార్కులోని స్టోర్ రూం వద్ద భద్రపరిచిన 5 వేల లీటర్ల సామర్థ్యం గల ఆరు వాటర్ ట్యాంకులు, ఐదు హెచ్‌డీపీ పైపులు పూర్తిగా కాలిపోయాయి. అంతేకాకుండా స్టోర్‌రూం(పాత గెస్ట్ హౌస్) కిటికీలు, తలుపులు, ఒక పెద్ద చింత చెట్టు, వెదురు పొదలు కూడా దగ్ధమయ్యాయి. కాగా.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత లేదు. సందర్శకులెవరైనా కాల్చిన సిగరెట్ ఆకులపై వేయడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని పార్కు సిబ్బంది భావిస్తున్నారు. పార్కులో చెత్త, చెట్ల ఆకులను సిబ్బంది ఇక్కడ స్టోర్ రూం సమీపంలో నీటి గ్యాలరీ పక్కన దిబ్బలుగా వేస్తారు. వాటికి తరచూ మంట పెట్టి కాల్చేస్తారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా మంట పెట్టడంతో అదుపు తప్పి.. వెదురు కొమ్మలకు అంటుకోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.
ముడసర్లోవ పార్కులో అగ్ని ప్రమాదం