కనులపండువగా శ్రీవారి ఆలయ వార్షికోత్సవం
కొమ్మాది: రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం(టీటీడీ) తృతీయ వార్షికోత్సవం గురువారం కనులపండువగా సాగింది. ఉత్సవంలో భాగంగా ఉదయం 5 గంటల నుంచి 5.30 వరకు సుప్రభాతం, 5.30 నుంచి 7 గంటల వరకు తోమాల సహస్ర నామార్చన, మొదటి అర్చన నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో భగవత్ అనూజ్ఞ, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, హోమం, ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శత కలశ స్నపనం, పూర్ణాహుతి, అక్షతారోపణం, స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ కనులపండువగా తిరుచ్చి ఉత్సవం జరిగింది. టీటీడీ అర్చకులు, వేద పండితులు ఉత్సవ మూర్తులను ఊరేగిస్తుండగా.. భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ నాటక ప్రదర్శన, భక్తుల కోలాటాలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలు, పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్లు శివకుమార్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.