
విశాఖ అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష
మహారాణిపేట: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశాఖలో అభివృద్ధి చర్యలు చేపట్టాల్సి ఉందని, దానికి తగినట్లు అక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నగర అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అమలు, డీటీఆర్ బాండ్ల జారీ తదితర అంశాలపై శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ విశాఖలో టీడీఆర్ బాండ్ల జారీలో మరింత వేగం పెంచాలని, చాలా వరకు పెండింగ్ ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై జీవీఎంసీ కమిషనర్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నెల రోజుల్లోగా పెండింగ్‌లో ఉన్న టీడీఆర్ బాండ్ల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించారు. మెట్రో, మెట్రో లైట్, మోడరన్ ఎలక్ట్రిక్ బస్ కారిడర్లపై ప్రధానంగా చర్చించారు.
మాస్టర్ ప్లాన్ మార్పులు, చేర్పులపై చర్చ
మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులపై ఎమ్మెల్యేలతో మంత్రి చర్చించారు. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై పునరాలోచన చేయాలని, తప్పకుండా మార్చాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. రోడ్ల విస్తరణ అవసరం ఎంత మేరకు ఉందో అంతవరకే ప్లాన్ అమలు చేయాలని, భూసేకరణ చేపట్టాలని ఎమ్మెల్యేలు సూచించారు. డబుల్ డెక్కర్ రోడ్లు, మెట్రో కారిడార్ నిర్మించేందుకు యోచిస్తున్నామని, అతి త్వరలోనే ముఖ్యమంత్రి సూచనల మేరకు కార్యాచరణ ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.