విశాఖ ఉక్కు ఉద్యమం @ 1500
● 2021 నుంచి అలుపెరగని పోరాటం
● నేడు దీక్ష శిబిరం వద్ద మానవహారం
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉద్యమం శనివారం నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఉక్కు కార్మిక వర్గం భగ్గుమంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటి నుంచి కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు చేశారు. జాతీయ రహదారిని పలుమార్లు దిగ్బంధించారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడి, గేట్ల ముట్టడి చేపట్టారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్‌లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. దీక్షలు ప్రారంభించిన నాటి నుంచి ముఖ్యమైన ఘట్టాలను పరిశీలిస్తే.. 2021 ఫిబ్రవరి 3న వేలాది మంది కార్మికులు ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడించారు. ఫిబ్రవరి 5న స్టీల్‌ప్లాంట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఫిబ్రవరి 12న సీపీఐ కార్యదర్శి నారాయణ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఫిబ్రవరి 17న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ విమానాశ్రయంలో పోరాట కమిటీ నాయకులతో సమావేశమై తమ సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో భారీ బహిరంగ సభ, జాతీయ రహదారి రాస్తారోకో, రెండు రోజులపాటు జాతీయ రహదారి దిగ్బంధం, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేత, చలో కలెక్టరేట్, 36 గంటల నిరాహార దీక్షలు తదితర కార్యక్రమాలు చేపట్టారు. రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయిత్ విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ప్రముఖ సామాజిక వేత్త మేథా పాట్కర్ దీక్ష శిబిరానికి విచ్చేసి కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. అప్పటి నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
నేడు మానవహారం : దీక్షలు ప్రారంభించి 1500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం దీక్ష శిబిరం వద్ద మానవహారం నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించరాదన్న డిమాండ్లపై ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.