మాజీ సర్పంచ్ భూమిలో టీడీపీ నేతల దౌర్జన్యం
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకుల దౌర్జన్యాల పరంపర కొనసాగుతోంది. పెందుర్తి మండలం జెర్రిపోతుపాలెం మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత కోన శ్రీనివాసరావుకు చెందిన డీ–ఫారం భూమిలోని సరుగుడు, అరటి తోటలను అదే గ్రామానికి చెందిన సర్పంచ్, టీడీపీ నేత మడక అప్పలరాజు, మరికొంత మంది నాయకులు ధ్వంసం చేశారు. అడ్డుకున్న శ్రీనివాసరావు, ఇతర గ్రామస్తులపై దాడికి పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలివీ.. జెర్రిపోతులపాలెం మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత కోన శ్రీనివాసరావుకు గ్రామానికి సమీపంలోని పెదగాడి సర్వే నంబర్ 420/1లో పిత్రార్జితంగా వచ్చిన డీ–ఫారం భూమి ఉంది. అందులోని కొంత భాగంలో సరుగుడు, అరటి తోట వేశారు. మిగిలిన భూమిలో కాయగూరలు పండిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సర్పంచ్ మడక అప్పలరాజు, టీడీపీ నాయకుడు గళ్ల శ్రీనివాసరావు, వారి అనుచరులు శ్రీనివాసరావుకు చెందిన భూమిలోకి చొరబడి మొక్కలను ఇష్టానుసారం నరికేశారు. సమాచారం అందుకున్న కోన శ్రీనివాసరావు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. టీడీపీ నాయకుల దౌర్జన్యంపై పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. తనకు టీడీపీ నాయకుల నుంచి ప్రాణ హాని ఉందని అందులో పేర్కొన్నారు. ఈ వివాదంపై టీడీపీ నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జెర్రిపోతులపాలెంలో సరుగుడు, అరటి చెట్ల తొలగింపు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు