స్మార్ట్‌కు మించి! | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌కు మించి!

Published Mon, Mar 24 2025 4:37 AM | Last Updated on Mon, Mar 24 2025 4:37 AM

స్మార

స్మార్ట్‌కు మించి!

● ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకువైజాగ్‌వాసుల ఆసక్తి ● అల్ట్రా ప్రీమియం ఫోన్ల వినియోగంలో 3వ స్థానంలో నగరం ● ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌ నివేదికలో వెల్లడి

ఈఎంఐ సౌకర్యంతో సులువుగా..

పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బుల చెల్లించి ఫోన్‌ కొనుగోలు చేసే విషయంలో మాత్రం వైజాగ్‌ వాసులు కాస్త జంకుతున్నారు. ఎంత ఖరీదైన ఫోన్‌ అయినా.. ఉందిగా ఈఎంఐ అంటూ వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లిస్తూ అల్ట్రా ప్రీమియంకి మారిపోతున్నారు. ప్రతి ఫోన్‌ కొనుగోలుపైనా ఈఎంఐ ఆఫర్లతో సెల్‌ఫోన్‌ షాపుల్లోనే కాకుండా..ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాంలలోనూ బ్యాంకులు, ఫైనాన్సింగ్‌ సంస్థలు ఆకర్షిస్తుండటంతో పని సులువవుతోంది. 3 లేదా 6 నెలల చెల్లింపుపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాది వాయిదాలు చెల్లిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంది.

సాక్షి, విశాఖపట్నం : స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు కేవలం అవసరం మాత్రమే కాదు.. ఒక స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. ఒకప్పుడు ఫోన్‌ పాడైపోయే వరకు వాడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొత్తగా స్మార్ట్‌ ఫీచర్లు వస్తే చాలు.. రేటుతో పనిలేకుండా కొనాల్సిందే అనే రోజులు వచ్చేశాయి. ఎందుకంటే ఫోన్‌ ఇప్పుడు ఇంట్లో ఒక వస్తువు కాదు.. శరీరంలో ఒక భాగమైపోయింది. అందుకే వైజాగ్‌ ప్రజలు చాలా మంది చెబుతున్న మాట ఒక్కటే.. నా ఫోన్‌ స్మార్ట్‌ మాత్రమే కాదు.. ప్రీమియం.! ఈ విషయాన్ని ప్రముఖ మార్కెట్‌ పరిశోధనా సంస్థ కౌంటర్‌ పాయింట్‌ ధ్రువీకరించింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోని ప్రజలు వాడుతున్న అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల గురించి కౌంటర్‌ పాయింట్‌ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సూరత్‌ మొదటి స్థానంలో నిలవగా, విశాఖ మూడవ స్థానంలో ఉండటం విశేషం.

ఒకప్పుడు కేవలం మాట్లాడటానికి ఉపయోగపడే ఫోన్‌ ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. అత్యాధునిక ఫీచర్లతో ప్రపంచాన్నే అరచేతిలో చూపిస్తోంది. అందుకే ప్రజలు కొత్త ఫోన్‌ కొనడానికి అంత ఆసక్తి చూపుతున్నారు. అద్భుతమైన ఫీచర్లు ఉంటే చాలు.. ధర గురించి ఆలోచించడం లేదు. కౌంటర్‌ పాయింట్‌ టెక్నాలజీ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఇటీవల ఈ విషయాన్ని తెలిపింది. టైర్‌–2 నగరాల్లో అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలలో సిల్క్‌ సిటీ, డైమండ్‌ సిటీగా పేరొందిన సూరత్‌ ముందు వరసలో ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన కోల్‌కతా, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, చైన్నెని మించి మరీ ఇక్కడ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జరుగుతుండటం విశేషం. దేశీయ మార్కెట్‌ వాటాలో సూరత్‌ 24 శాతం ఆక్రమించడం గమనార్హం. సూరత్‌లో ఎక్కువగా రూ.2,45,000 కంటే ఎక్కువ ధర గల స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జరుగుతున్నట్లు నివేదిక చెబుతోంది.

ఆపిల్‌ ప్రో.. లేదంటే ఎస్‌ సిరీస్‌..

మహా విశాఖ నగరంలో ఆల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ ఫోన్ల విక్రయాల్లో ఆపిల్‌, శాంసంగ్‌ పోటీపడుతున్నాయి. వీటి తర్వాత వన్‌ప్లస్‌, వివో, గూగుల్‌, షియోమీ ఫోన్ల కొనుగోలుపై నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆపిల్‌ 16, 16 ప్రోతో పాటు శాంసంగ్‌ ఎస్‌ 23, 24, 25 సిరీస్‌ ఫోన్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని కౌంటర్‌ పాయింట్‌ సర్వే చెబుతోంది. ప్రతి 50 మందిలో ఒకరు రూ.1.50 లక్షకు మించి ధర పెట్టి కొనుగోలు చేసిన ఫోన్లను వాడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఏఐ ఆధారిత ఫీచర్‌లపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ప్రీమియం ఫోన్లను ఆశ్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.

కెమెరా ఫీచర్‌ నచ్చితే చాలు

హై ఎండ్‌ ఫీచర్లున్న ఫోన్లు వాడటమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కెమెరా బాగుండాలి. ఇటీవల ఐఫోన్‌–16 ప్రో తీసుకున్నాను. దానికంటే ఎస్‌–24 ఆల్ట్రాలో కెమెరా అద్భుతంగా ఉందని చూశాను. ఇప్పుడు దానికి షిఫ్ట్‌ అవుతున్నాను. ప్రస్తుతం వస్తున్న ప్రీమియం ఫోన్లలో ఏఐ బేస్డ్‌ టెక్నాలజీతో పాటు కెమెరా వినియోగం కూడా వచ్చేసింది. టెక్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండాలి.

– పుప్పాల మోహన లక్ష్మి, గృహిణి

వైజాగ్‌ వాసులూ.. ప్రీమియం ప్రియులే.!

ద్వితీయ శ్రేణి నగరాల్లో అన్ని విభాగాల్లోనూ ముందు వరుసలో ఉండే విశాఖ.. ప్రీమియం ఫోన్ల కొనుగోళ్లలోనూ తక్కువేం కాదని నిరూపించుకుంది. సూరత్‌ తర్వాత జైపూర్‌ రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో విశాఖపట్నం నిలిచింది. రూ.1.50 లక్షల నుంచి రూ.2.45 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ల కొనుగోళ్లలో వైజాగ్‌ మార్కెట్‌ వాటా 0.8 శాతంగా ఉంది. ప్రీమియం మోడళ్ల వైపు నగరవాసుల మార్పు ఏడాది పొడవునా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వైజాగ్‌లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో ప్రీమియం ఫోన్ల విభాగం వాటా మే 2024లో 10 శాతం నుంచి అక్టోబర్‌లో 18 శాతానికి పెరగడం విశేషం.

స్మార్ట్‌కు మించి!1
1/2

స్మార్ట్‌కు మించి!

స్మార్ట్‌కు మించి!2
2/2

స్మార్ట్‌కు మించి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement