ఖజానా ఖాళీ!
● ఉద్యోగుల జీతాలు మినహా అన్ని బిల్లులు కట్ ● కాంట్రాక్టర్ల బిల్లులు, ఇతర చెల్లింపులన్నీ బంద్ ● బోసిపోతున్న ఖజానా కార్యాలయం
మహారాణిపేట : సంపద సృష్టికర్త హయాంలో ఖజానా ఖాళీ అయిపోయింది. ఉద్యోగుల జీతాలు, పింఛన్ల మినహా మిగిలిన అన్ని బిల్లులు మురిగిపోతున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులతో పాటు ఇతర చెల్లింపులన్నీ బంద్ అయిపోయాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో బిల్లుల కోసం వచ్చే కాంట్రాక్టర్లు, ఇతరులతో రద్దీగా కనిపించే ఖజానా కార్యాలయాలు నేడు బోసిపోతున్నాయి. బిల్లులు తీసుకోకపోవడంతో ఎవరూ ట్రెజరీ కార్యాలయాలకు రావడం మానేశారు. దీంతో ఖజానా సిబ్బంది సైతం ఖాళీ అయిపోయారు.
అన్ని బంద్ : జిల్లాలో 32 డిపార్టుమెంట్లలో టెలిఫోన్, కరెంటు, స్టేషనరీ బిల్లులు, ఇతర చెల్లింపులు కూడా బంద్ అయ్యాయి. అలాగే కార్యాలయం నిర్వహణ ఖర్చులకు కూడా చెల్లింపులు జరగడం లేదు. పలు శాఖల అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే రవాణా భత్యం(టీఏ, డీఏ)లు, జీపీఎఫ్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలిపివేశారు. గతంలో అయితే ప్రభుత్వ శాఖలు ఇచ్చే బిల్లులను ట్రెజరీ శాఖ సిబ్బంది వాటిని సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లోని అప్‌లోడ్ చేసేవారు. ప్రభుత్వ శాఖలో పలు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కారు. గత వారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వినతులు ఇవ్వగా.. మంగళవారం నగరంలో ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు వివిధ విభాగాల కాంట్రాక్టర్లు ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీ నిర్వహించారు.
బోసిపోతున్న కార్యాలయాలు
ఆర్థిక సంవత్సరం చివరిలో ట్రెజరీ కార్యాలయాలు బిల్లుల కోసం వచ్చే వారితో సందడిగా కనిపించేవి. ఈ సమయంలో సిబ్బంది అర్థరాత్రి సైతం విధులు నిర్వర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు మినహా మిగిలిన అన్ని బిల్లులు నిలుపుదల చేయడంతో ట్రెజరీ సిబ్బంది ఖాళీ అయ్యారు.
ఆర్థిక సంక్షోభంలో పలు శాఖలు
పలు ప్రభుత్వ శాఖలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో అన్ని రకాల బిల్లులను నిలిపివేయాలని ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో ఆదేశించింది. ఫలితంగా ఉద్యోగులకు సంబంధించిన బిల్లులతో పాటు కాంట్రాక్టు బిల్లులను నిలిపివేశారు. దీంతో నిధుల సంక్షోభంతో ప్రభుత్వ శాఖలు కటకటలాడుతున్నాయి.