గత ప్రభుత్వ హయాంలో యాదవులకు సముచిత స్థానం
● కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర యాదవులకు తీరని అన్యాయం ● జిల్లా యాదవ సంఘం నాయకులు
సీతంపేట: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో యాదవులకు సముచిత స్థానం దక్కిందని, కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో పదవులు కేటాయించి.. గౌరవించాలని జిల్లా యాదవ సంఘం నాయకులు ఒమ్మి కనకరాజు యాదవ్, పిన్నింటి ఆదిమూర్తి డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో మంగళవారం విలేకరులతో వారు మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎమ్మెల్సీ, విశాఖ జిల్లాలో ఓ ఎమ్మెల్సీ, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్, జీవీఎంసీ మేయర్ ఇలా చాలా పదవులు యాదవులకు కేటాయించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో కనీసం జనాభా ప్రాతిపదికన కూడా రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కూటమి పార్టీలు యాదవులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటున్నాయని ఆక్షేపించారు. జీవీఎంసీ పరిధిలో 22 మంది కార్పొరేటర్లు యాదవులు ఉన్నారని, గత ప్రభుత్వం యాదవ మహిళకు మేయర్ పదవి కేటాయించి సముచిత స్థానం కల్పించిందన్నారు. మేయర్ పదవి నుంచి యాదవ మహిళను తొలగిస్తే తీవ్ర మానసిక ఆందోళన పెంచినట్లేనన్నారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపునకు యాదవ సామాజిక వర్గం కృషి చేసిందని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర జిల్లా ల్లో 16 లక్షల వరకు యాదవులున్నా, దానికి తగ్గట్టు ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు దక్కలేదన్నారు. యాదవ నాయకులు యడ్ల వేణుగోపాల్‌కృష్ణ(సుమన్), నక్కా పద్మ, ఒమ్మి ఆనంద్, అల్లు రమణ, ఇసరపు వెంకటలక్ష్మి, చందక శ్రీను, ఈశ్వరరావు పాల్గొన్నారు.