వందేళ్ల జ్ఞాపకం.. విశాఖ విజయ రథం
దేశంలో ఎలక్ట్రిక్ రైలు కార్యకలాపాలు ప్రారంభమై వందేళ్లు పూర్తయ్యాయి. ఈ శతాబ్ది వేడుకల సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్తగా సంబరాలు చేసుకుంది. ఎలక్ట్రికల్ రైల్వే వ్యవస్థకు చిహ్నంగా థీమ్ బేస్డ్ స్పెషల్ ఇంజిన్‌ను రూపొందించింది. ఈ ఇంజిన్‌ను ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానించింది. త్రివర్ణ పతాకం ఐకానిక్‌గా.. విశాఖ చరిత్రను, విశిష్టతనుస్పృశిస్తూ రైల్వే యంత్రాంగం ‘విశాఖ విజయ రథం’పేరుతో ఈ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. – సాక్షి, విశాఖపట్నం
బాంబే విక్టోరియా టెర్మినస్ (ప్రస్తుతం సీఎస్‌ఎంటీ), కుర్లా మధ్య 1925 ఫిబ్రవరి 3న మొదటి ఎలక్ట్రిక్ రైలు పరుగులు పెట్టింది. ఈ చారిత్రక రోజున భారతీయ రైల్వే వ్యవస్థ ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఆ తర్వాత ఇండియన్ రైల్వే వరుస విజయాలతో దూసుకుపోయింది. వందేళ్ల పండగకు ప్రతీకగా, వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త ఆలోచనతో అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లలో ఒకటైన వాల్తేరు లోకోషెడ్ ఆధ్వర్యంలో థీమ్ బేస్డ్ లోకోను రూపొందించింది. దీనికి విశాఖ విజయరథంగా నామకరణం చేశారు. డబ్ల్యూఏపీ–7 (నం.39145)తో రూపొందించిన ఎలక్ట్రిక్ లోకోను బుధవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి డీఆర్‌ఎం లలిత్‌బోరా జెండా ఊపి ప్రారంభించారు. ఏడీఆర్‌ఎం (ఇన్‌ఫ్రా) ఈ సీతారామ్, ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బి.షణ్ముఖరావు నేతృత్వంలో రూపొందించిన ఈ లోకోమోటివ్‌ను బెంగళూరు–భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానించారు.
త్రివర్ణపతాకం.. విశాఖ వైభవం
వాల్తేరు ఎలక్ట్రిక్ లోకో షెడ్ 39145 నంబర్ గల WATE WAP–7 లోకోను రూపొందించినప్పుడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా.. త్రివర్ణ పతాకంతో శోభిల్లేలా లోకో మొత్తం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అంతేకాదు విశాఖ నగరపు ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేసేలా కొన్ని ముఖ్యమైన చిహ్నాలను కూడా దీనిపై ముద్రించారు. ఈ లోకో ఇంజిన్‌పై తూర్పు నౌకాదళానికి గుర్తుగా జలాంతర్గామి, విశాఖపట్నం పోర్టు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం ఆలయం, పారిశ్రామిక హబ్‌గా గుర్తింపు పొందిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన లోకో విశాఖ నగరానికి, భారతీయ రైల్వేకు గర్వకారణంగా నిలుస్తోంది.
ఎలక్ట్రికల్ రైల్వే వ్యవస్థకు వందేళ్లు
థీమ్ బేస్డ్ ఇంజిన్ రూపకల్పన
విశాఖ ఘనత చాటేలా వాల్తేరు లోకోషెడ్ శ్రద్ధ
కర్బన ఉద్గారాల నియంత్రణలో కీలకం..
శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ ఈ ఎలక్ట్రిక్ లోకోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అద్భుత ఘట్టానికి వందేళ్లు పూర్తవ్వగా, ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశాఖ విజయరథం రూపొందించడం శుభపరిణామం. వాల్తేరు ఎలక్ట్రిక్ లోకో షెడ్ 336 లోకోల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. నిరంతరం ఎంతో పని ఒత్తిడి ఉన్నా.. వందేళ్ల ఉత్సవానికి గుర్తుగా అద్భుతమైన లోకోను తీర్చిదిద్దినందుకు షెడ్ సిబ్బందికి కృతజ్ఞతలు. ఎలక్ట్రిక్ లోకోల రాకతో భారతీయ రైల్వే ప్రయాణ వేగాన్ని క్రమంగా పెంచుకుంటూ దూసుకుపోతోంది.
– లలిత్‌బోరా, వాల్తేరు డీఆర్‌ఎం
వందేళ్ల జ్ఞాపకం.. విశాఖ విజయ రథం