మేయర్ గుబులు!
టీడీపీలో
అవిశ్వాస
తీర్మానంతో
ఆందోళన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
కూటమి పార్టీలకు మేయర్ అవిశ్వాసం గుబులు మొదలైంది. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మెజార్టీ లేకపోయినప్పటికీ కలెక్టర్‌ను కలిసి కూటమి పార్టీల నేతలు నోటీసులు అందజేశారు. ఒకవైపు అసలు మెజార్టీ లేకపోవడం ప్రధాన సమస్య కాగా.. తీరా నోటీసుల తర్వాత సొంత పార్టీలోనే మేయర్ పీఠాన్ని అధిష్టించేది ఎవరనే ప్రశ్నలతో పాటు తమ సామాజికవర్గానికే మేయర్ పీఠాన్ని ఇవ్వాలంటూ యాదవ నేతలంతా ఐక్యంగా గొంతు కలపడం కూటమి ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పనికావడం లేదని భావించడంతోనే లోకేష్ తెరమీదకు వచ్చినట్టు సమాచారం. మరింతగా ప్రలోభాలు పెట్టో.. బెదిరింపులకు పాల్పడటం ద్వారానో అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన 2/3 మంది కార్పొరేటర్లను (64 మంది) లాగేసేందుకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విశాఖలో కూడా అమలు చేసేందుకే లోకేష్ వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, లోకేష్ రాకపై అటు అధికార యంత్రాంగానికి.. పార్టీలోని ముఖ్యనేతలకు అధికారికంగా సమాచారం లేదు. కానీ లోకేష్ సమావేశం విషయం వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ టీమ్ ద్వారా ప్రజాప్రతినిధులకు సమాచారం చేరవేస్తుండడం చర్చనీయాంశమవుతోంది.
అవినీతి ఆరోపణలతో...!
మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న వ్యక్తితో పాటు డిప్యూటీ మేయర్లుగా రంగంలో ఉన్న మరో ముగ్గురు కార్పొరేటర్ల వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. స్టాండింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా వసూళ్లతో పాటు ప్రతీ పనికీ ఇంత రేటు చెప్పి వసూలు చేస్తున్న వ్యవహారంపై అనేక విమర్శలున్నాయి. ఈ నలుగురు కలిసి ఇప్పటికే కార్పొరేషన్లలో తెగబడి చేస్తున్న వసూళ్లతో చెడ్డపేరు వచ్చిందని కూటమిలోని ఇతర కార్పొరేటర్లు మండిపడుతున్నారు. కొద్ది మంది కాంట్రాక్టర్లు బీజేపీ ఎమ్మెల్యేను కలిసి మరీ వసూళ్ల పర్వంపై ఫిర్యాదు కూడా చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా నేరుగా టీడీపీ అధిష్టానానికి కూడా వీరి వ్యవహారశైలిపై ఫిర్యాదులు రావడంతో పునరాలోచన పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లోకేష్ నిర్వహించబోయే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతోంది.