న్యాయవాదుల సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
విశాఖ లీగల్: ఈ నెల 28వ తేదీన జరిగే న్యాయవాదుల సంఘం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి జీఎం రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఖరారు చేసిన న్యాయవాదుల జాబితా ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నారు. 2,958 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. జూనియర్, సీనియర్లు, 60 ఏళ్లు దాటిన న్యాయవాదులకు ప్రత్యేకంగా ఓటు వేయడానికి ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయని, అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామన్నారు. రాత్రి పది గంటలకు ఫలితాలు వెల్లడిస్తామని జీఎం రెడ్డి వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఎన్నికలు సాఫీగా సాగడానికి నలుగురు ఉపఎన్నికల అధికారులను నియమించినట్లు తెలిపారు.