సాక్షి ప్రతినిధి, విజయనగరం: భీమసింగి వద్దనున్న విజయరామ సహకార చక్కెర కర్మాగారాన్ని 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏవిధంగా నిర్వీర్యం చేసిందీ గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాటలు కళ్లకు కడుతున్నాయి. 1995 నుంచి 2003 వరకూ రాష్ట్రంలోనున్న 18 సహకార చక్కెర కర్మాగారాల్లో ఎనిమిది ప్రైవేట్ పరమయ్యాయి. భీమసింగి కర్మాగారాన్నీ అదేబాట పట్టించేందుకు కత్తి వేలాడదీశారు.
2003–04 సీజన్‌లో క్రషింగ్ చేయకూడదని అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చిన సంగతి రైతులకు తెలియనిది కాదు. ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూతపడింది. నాటి ప్రతిపక్ష నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర 2003 ఏప్రిల్‌లో భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ మీదుగానే సాగింది. ఆ సమయంలో చెరకు రైతులు ఆయన వద్ద తమ గోడు వినిపించుకున్నారు. వారికి అభయమిచ్చిన ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫ్యాక్టరీని తెరిపించారు. ప్రభుత్వ గ్యారెంటీతో రూ.3.50 కోట్ల రుణం అందించారు.
అప్పటికి ఫ్యాక్టరీకి గుదిబండగానున్న అప్పులు రూ.18.04 కోట్లను ప్రభుత్వ షేరు ధనంగా మార్చారు. ఆధునికీకరణకు రూ.36.18 కోట్లు మంజూరు చేశారు. తద్వారా క్రషింగ్ సామర్థ్యాన్ని 1205 మెట్రిక్ టన్నుల నుంచి 2 వేల మెట్రిక్ టన్నులకు పెంచడం, పవర్ ప్లాంట్ ఉత్పత్తి కూడా 1.5 కిలోవాట్ల నుంచి 12 కిలోవాట్లకు పెంచడం లక్ష్యాలుగా నిర్దేశించారు. మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ఫ్యాక్టరీ కొంత లాభపడటం అనేదీ ఇందులో భాగం. మరోవైపు ఫ్యాక్టరీ ఆధునికీకరణకు తమ వంతు సహకారంగా రైతులు నుంచి రూ.3 కోట్ల వరకూ పెట్టుబడి నిధి కూడా సేకరించారు. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది వడ్డీతో రూ.5 కోట్లు అయ్యింది.
టీడీపీ పాలనలోనే శాపం...
విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం, నెల్లిమర్ల, భీమిలి నియోజకవర్గాల పరిధిలో రైతులకు మేలు చేసేలా భీమసింగి చక్కెర కర్మాగారం 1976–77లో తొలిసారి క్రషింగ్‌ను ప్రారంభించింది. దీనిలో 16,873 మంది రైతులు షేర్ హోల్డర్స్‌గా, 3500 మంది నాన్ షేర్ హోల్డర్స్‌గా ఉన్నారు. తొలుత 543 గ్రామాల్లో ఆరు వేల మంది రైతులకు ఉపయోగపడేది. ఆ సమయంలో 8 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. టీడీపీ పాలనలో జరిగిన తప్పిదాలు, వరుస నష్టాలతో రైతులు చెరకు సాగు తగ్గించేశారు. ప్రస్తుతం సుమారు 2,500 మంది రైతులు కేవలం 3,500 ఎకరాల్లో మాత్రమే చెరకు చేస్తున్నారు. కార్మికుల సంఖ్య కూడా 838 నుంచి 263కు తగ్గిపోయింది.
రైతులకు ఉపయోగపడేలా...
భీమసింగితో పాటు రాష్ట్రంలోని పలు సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి నిపుణుల కమిటీని నియమించారు. అదే సమయంలో భీమసింగి ఫ్యాక్టరీపై ఆధారపడిన రైతులకు నష్టం లేకుండా జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గత మూడేళ్లుగా రైతులు సంకిలి వద్దనున్న ఈఐడీ ప్యారీ సుగర్ ఫ్యాక్టరీకి చెరకును తరలిస్తున్నారు. బిల్లులు కూడా పక్షం రోజులకోసారి చెల్లించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ దుస్థితికి బాధ్యులు టీడీపీ నాయకులే....
‘భీమసింగి చక్కెర కర్మాగారం దుస్థితికి ముమ్మాటికీ టీడీపీ నాయకులే కారణం. ఇప్పుడు చెరకు రైతులను మభ్యపెట్టడానికి మొసలికన్నీరు కార్చుతున్నారు. సహకార రంగంలోనున్న చక్కెర కర్మాగారాలను ప్రైవేట్‌పరం చేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు తొలి దఫా పాలన సమయంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఫలితంగా 2003 సంవత్సరం నాటికి భీమసింగి మూతపడింది. సీతానగరం వద్దనున్న చక్కెర కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేసేశారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి ఫ్యాక్టరీకి జీవం పోశారు.
లాభాల బాట పట్టించారు. మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా నష్టాల్లో ముంచారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం రైతుల వంతుగా సేకరించిన రూ.5 కోట్ల సొమ్మును అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు దుర్వినియోగం చేశారు. రూ.12 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు హామీ కాగితాలకే పరిమితమైంది. వారు అనుసరించిన విధానాలతో నష్టపోయిన రైతులు చెరకు సాగు నుంచి క్రమేపీ తప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సరికి నాలుగో వంతుకు సాగు విస్తీర్ణం పడిపోయింది.
ఇంత తక్కువ క్రషింగ్‌తో ఫ్యాక్టరీని నడపడం ఆర్థికంగా మరింత నష్టమే తప్ప లాభంలేని పరిస్థితి. అయినప్పటికీ పదిమందికీ ఉపాధి కల్పించాలనే సంకల్పంతో 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సహకార చక్కెర కర్మాగారాలపై సబ్‌కమిటీ వేసిన సంగతి తెలిసిందే. చెరకు రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే సంకిలి వద్దనున్న ప్యారీస్ సుగర్ ఫ్యాక్టరీకి అనుసంధానం చేశాం. రైతులకు సకాలంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. వాస్తవాన్ని దాచేసి రాజకీయం చేయడం టీడీపీ నాయకులకు తగదు.’
– బొత్స అప్పలనర్సయ్య, గజపతినగరం ఎమ్మెల్యే
అనాలోచిత చర్యలు...
2014 సంవత్సరంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని విస్మరించింది. అప్పటి గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ఫ్యాక్టరీ జనరల్ బాడీ సమావేశాన్ని తూతూమంత్రంగా నడిపించేవారు. టీడీపీ నాయకుడు అశోక్ గజపతిరాజు ఆ సమావేశాలకు హాజరైన దాఖలాలు లేవు. ఇదే అదనుగా ఫ్యాక్టరీ ఆధునికీకరణకు బ్యాంకులో ఉన్న రూ.5 కోట్ల నిధిని కె.ఎ.నాయుడు దుర్వినియోగం చేశారు. రైతులు అడగకపోయినా ఆ డిపాజిట్లను పంచేశారు. దీంతో ఆధునికీకరణ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగానే తెరవెనుకకు పంపించేశారు. కర్మాగారం కమిటీ చైర్మన్‌గా గంట్యాడ మండలానికి చెందిన గుల్లిపల్లి లలితను నియమించినప్పటికీ నెల తిరగకముందే ఆమె పదవికి స్వయంగా టీడీపీ నాయకులే ఎసరుపెట్టారు. వర్గపోరుతో కోర్టుకెళ్లి ఆమె పదవిని రద్దు చేయించారు.
తీరని నష్టాల్లోకి ఫ్యాక్టరీ...
గత టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ తీరని నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు సుమారు రూ.47.88 కోట్లు నష్టాల్లో ఉంది. వీటికి తోడు ఆప్కాబ్ నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకొచ్చారు. దీనిపై ఏటా దాదాపు రూ.3.2 కోట్ల వరకూ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు కర్మాగారం యంత్రాలన్నీ మూడు దశాబ్దాలు అయిపోవడంతో పాతవయ్యాయి. పవర్ యూనిట్ చినుకుపడితే చాలు కారిపోతోంది. దీని ఆధునికీకరణకు గత టీడీపీ ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరుచేసినట్లు ప్రకటించినా అది కాగితాలకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment