సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు
విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో రగిలిపోతున్న బీసీలు
మాటలకే తప్ప బీసీలకు న్యాయం చేయలేదని టీడీపీపై ఆగ్రహం
బీసీల జిల్లాలో ఓసీలకు సీట్లు ఎలా ఇస్తారని మండిపాటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/డెంకాడ: బీసీలే తమ పార్టీకి వెన్నుముక అంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు చెప్పిన మాటలు నేతిబీరకాయ చందమేనని మరోసారి తేటతెల్లమైంది. అత్యధిక శాతం బీసీ సామాజిక వర్గాలున్న విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో అగ్రవర్గాలకే టీడీపీ నేతృత్వంలోని కూటమి పెద్దపీట వేస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో బీసీ నేతల పేర్లు కనిపించట్లేదు. దీంతో ఆయా సామాజిక వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా టీడీపీకి వెన్నుదన్నుగా నిలబడిన కొప్పుల సామాజికవర్గ నాయకులు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. టీడీపీ అధిష్టానం తీరును నిరసిస్తూ పలుచోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా యి. ఎస్సీ రిజర్వుర్డ్ నియోజకవర్గమైన రాజాం మినహా మిగతా ఆరు ఎచ్చెర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం జనరల్ నియోజకవర్గాలు. జనసేనతో జతకట్టిన టీడీపీ ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో ఎచ్చెర్ల, చీపురుపల్లి మినహా మిగతా నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారుచేసింది. బొబ్బిలి టిక్కెట్‌ను వెలమ (ఓసీ) సామాజికవర్గానికి చెందిన ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)కు, గజపతినగరం టికెట్ తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాస్‌కు, విజయనగరం టిక్కెట్‌ను క్షత్రియ (ఓసీ) సామాజిక వర్గానికి చెందిన అదితి గజపతిరాజుకు కేటాయించింది. జనసేనకు కేటాయించిన నెల్లిమర్ల టికెట్ కూడా ఓసీలకే వెళ్లిపోయింది. తూర్పు కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉండే నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి కేటాయించడాన్ని తూర్పు కాపు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదేమి తంటా...
నెల్లిమర్ల అసెంబ్లీ సీటు జనసేన పార్టీకి, విజయనగరం లోక్‌సభ సీటు బీజేపీకి కేటాయిస్తే... తాము పసుపు జెండా పక్కనబెట్టి ఆ పార్టీ జెండాలు మోయాలా అంటూ నెల్లిమర్ల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. నెల్లిమర్ల, డెంకాడ మండల కేంద్రాల్లో మంగళవారం సాయంత్రం టీడీపీ నాయకులు కడగల ఆనందకుమార్, కంది చంద్రశేఖర్ నేతృత్వంలో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇలాగైతే టీడీపీ కనుమరుగైపోయినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం లోక్‌సభ టికెట్ విషయంలో పునరాలోచించాలని డిమాండు చేస్తూ అధిష్టానానికి మూడు రోజుల గడువు ఇచ్చారు. తూర్పుకాపులు అత్యధికంగా ఉన్న విజయనగరం లోక్‌సభ స్థానం ఇతరులకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీసీల ఆశలు ఆవిరి....
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి రెండో జాబితాలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించిన బీసీల ఆశలు ఆవిరయ్యాయి. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గం అత్యధికంగా ఉండే చీపురుపల్లిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున (బీసీ)ను కాదని కాపు (ఓసీ) సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావును పంపాలని చంద్రబాబు శతవిధాలా ప్రయ త్నాలు చేస్తున్నారు. ఆ పంచాయితీ ఇంకా కొనసాగుతుండగానే విజయనగరం లోక్‌సభ సీటు కూడా ఓసీలే తన్నుకుపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ సీటును బీజేపీకి కేటాయించారు. తీరా ఈ టికెట్ అయినా బీసీలకే ఇస్తారా? అంటే సందేహమే. చంద్రబాబు బంటు సీఎం రమేష్ పోటీ చేస్తారనే ఉహాగానాలు షికారు చేస్తు న్నాయి.
వాస్తవానికి విజయనగరం లోక్‌సభ స్థానం బీజేపీకి వస్తే పోటీ చేయాలని స్థానికురాలైన రెడ్డి పావని ఆశలు పెట్టుకున్నారు. బీసీ కొప్పులవెలమ సామాజికవర్గానికి చెందిన ఆమె ఉన్నత విద్యావంతురాలు. గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలందించారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బీసీ కోటాలో టికెట్ కోసం ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో విశాఖపట్నానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ నాయకుడు సాగి కాశీవిశ్వనాథరాజు (ఓసీ, క్షత్రియ) గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే మాధవ్ మరోవైపు అనకాపల్లి లోక్‌సభ టికెట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment