శృంగవరపుకోట: మీ అందరి అభిప్రాయం మేరకు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు నేను సిద్ధమని నియోజకవర్గ యువనేత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ శుక్రవారం సాయంత్రం ఎస్.కోటలోని తన కార్యాలయంలో ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉన్న తనకు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఎస్.కోట టికెట్ కేటాయించినట్టు టీడీపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో విడుదలైన జాబితాలో తన పేరు లేదన్నారు. వాస్తవంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ల ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చి అనతి కాలంలోనే మీ అందరి అభిమానంతో నియోజకవర్గంలో నాయకునిగా ఎదిగానన్నారు.
ఇన్నాళ్లు పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తూ వచ్చామని, ఎవరెన్ని అవమానాలకు గురిచేసినా భరించానని తెలిపారు. ఇన్నాళ్లు నాతో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏది చెబితే దానికి సిద్ధమని స్పష్టంచేశారు. ఎస్.కోటలోనే ఉండి మీ అందరి కష్టాసుఖాల్లో తోడుగా ఉంటానన్నారు. అవసరమైతే చంద్రబాబు, లోకేశ్‌ల బొమ్మను పెట్టుకుని వేరే గుర్తుతో ఇండిపెండెంట్‌గా పోటీకి వెళ్దామన్నారు. గొడవ పెట్టుకోవాలంటే నిముషం పట్టదని, తనను కవ్వించేలా కామెంట్స్ పెట్టినా పార్టీ ఆదేశాల ప్రకారం అన్ని భరించామని, ఇకపై కామెంట్ చేసేవారిని ఇంటికి వెళ్లి తన్నడానికి సిద్ధమన్నారు.
పార్టీ సీనియర్ నాయకులు రాయవరపు చంద్రశేఖర్, లగుడు రవి, గొరపల్లి రాము, ఇప్పాక త్రివేణి, గుమ్మడి భారతి, పైడిబాబు తదితరులు మాట్లాడుతూ ఎస్.కోటలో చచ్చిపోతున్న టీడీపీకి గొంప కృష్ణ ఊపిరిపోశారని, అలాంటి నాయకుడికి టీడీపీ అధిష్టానం మోసం చేసిందన్నారు. నాయకులందరం చర్చించుకుని గొంప కృష్ణను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దించుదామన్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి ఉన్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తును పెయింట్‌తో చెరిపేశారు.
పదవికి గొంపకృష్ణ రాజీనామా
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి గొంప కృష్ణ గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయనతో పాటు పార్టీ వేపాడ, కొత్తవలస, జామి మండలాధ్యక్షులు గొంప వెంకటరావు, గొరపల్లి రాము, లగుడు రవికుమార్, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి వారి పదవులకు రాజీనామా చేశారు.
జోరుగా బెట్టింగ్‌లు
ఎస్.కోట టీడీపీ అభ్యర్థి ఎవరనేదానిపై గత రెండు రోజులుగా జోరుగా బెట్టింగ్‌లు సాగాయి. ఓ గ్రూపుగా ఏర్పడి రూ.5లక్షలు, ఓ రియల్టర్ రూ.2లక్షలు, ఓ వ్యాపారి రూ.లక్షలు, మరికొందరు మద్యం కోసం పందెం కాశారు.
Comments
Please login to add a commentAdd a comment