
శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణకే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులు, మెడికల్ సర్టిఫికెట్లు త్వరగా తెప్పించి కేసులు ఛేదించాలని సూచించారు. బెట్టింగ్, లోన్ యాప్ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం వస్తే వెంటనే దాడులు చేయాలని ఆదేశించారు. ప్రజలతో మమేకమై సత్సంబంధాలు కొనసాగించాలని.. అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి అని, సిబ్బంది ప్రతి ఒక్కరూ విధుల్లో యూనిఫాం ధరించి ఉండాలని సూచించారు. అవినీతికి దూరంగా ఉంటూ నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని.. డయల్ 100, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కోర్టు డ్యూటీ అధికారులతో రోజు సమీక్షిస్తూ నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేయాలని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ప్రమాదాలను నియంత్రించాలన్నారు. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. బ్లూకోర్ట్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ అధికారులు కీలకంగా వ్యవహరిస్తూ ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఐపీఎల్ బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి
ఎస్పీ రావుల గిరిధర్