
ట్రాఫిక్ తంటాలు..
జిల్లాకేంద్రంలో పెరిగిన రద్దీ
●
రాకపోకలకు ఇబ్బందులు..
జిల్లాకేంద్రంలోని కమాన్, శంకర్‌గంజ్, హనుమాన్‌టేకిడీ ప్రాంతాల్లో రద్దీ పెరిగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గతంలో పార్సిల్ వాహనాలను పట్టణంలోకి నిర్ధేశిత సమయంలోనే అనుమతించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో ట్రాఫిక్ అవస్థలు తప్పడం లేదు. అధికారులు దృష్టి సారించి నియంత్రణకు చర్యలు చేపట్టాలి.
– శ్రీనివాసులు, హనుమాన్ టేకిడీ
పార్కింగ్ సమస్య..
వనపర్తిలో రోడ్ల విస్తరణ పూర్తయిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దుకాణాల ఎదుట చెబుతున్నా వినకుండా ఒక్కరి తర్వాత ఒకరు వాహనాలు నిలుపుతుండటంతో రోడ్డుపైకి వస్తున్నాయి. బస్ డిపో రోడ్డులోని బ్యాంక్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది.
– వెంకట్‌శెట్టి, వ్యాపారి, రాజీవ్‌చౌక్
త్వరలోనే పార్కింగ్ జోన్లు..
పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతాం. వాహనాదారులు ప్రజల ఇబ్బందులను గుర్తించి బాధ్యతగా మెలగాలి.
– ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి
వనపర్తి టౌన్: అధికారుల ప్రణాళిక లోపం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటం, తగిన చర్యలకు మీనమేషాలు లెక్కించడం వెరసి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. జిల్లాకేంద్రంలో లక్షకుపైగా జనాభా ఉండగా.. ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం రోజుకు 60 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లాకేంద్రంలోని ఏ రహదారి చూసినా వాహనాలు, జనంతో నిత్యం రద్దీగా కనిపిస్తుంటుంది. అలాగే వాహనదారులు నో ఎంట్రీ ప్రదేశాల్లోనూ దర్జాగా వాహనాలు మళ్లిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదాలపై ఉన్నా.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రత్యేక పార్కింగ్ జోన్లు లేకపోవడంతో రోడ్లపై ఇష్టారీతిన వాహనాలు నిలుపుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు పార్కింగ్ సమస్య కూడా వేధిస్తోంది. ఫలితంగా వాహనాలు నిలపడం.. నడపడం సమస్యగా మారింది. వనపర్తిలో పోస్టాఫీసుతో కలిపి 15 బ్యాంకులు ప్రధాన రహదారుల పక్కనే ఉన్నాయి. రోజు ఆయా బ్యాంకులకు సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా.. పార్కింగ్ అందుబాటులో లేకపోవడంతో రహదారిపైనే వాహనాలు నిలుపుతున్నారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, కూరగాయాల మార్కెట్, స్వర్ణకారులు, కిరాణం, దుస్తు దుకాణాల ఎదుట ద్విచక్ర వాహనాలేగాక కార్లు, ఆటోలు సైతం నిలుపుతుండటం సమస్యగా మారింది. ట్రాఫిక్ నియంత్రణకు అరకొరగా సిబ్బంది ఉండటంతో నియంత్రణ శక్తికి మించిన పనైంది. దీనికితోడు బిజీగా ఉండే అంతర్గత రహదారులపై ఎవరూ దృష్టి సారించడం లేదు. గతంలో పలువురు డీఎస్పీలు ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు నిర్ధిష్ట సమయం విధించారు. ఇప్పుడు దానిని ఉల్లంఘించడంతో అంతర్గత రహదారుల్లో ట్రాఫిక్ అవస్థలకు మరో కారణంగా చెప్పవచ్చు. పార్కింగ్ ప్రాంతాలు గుర్తించేందుకు అవకాశం ఉన్న వినియోగంలోకి తేక రద్దీ అధికంగా ఉంటుంది.
జిల్లాకేంద్రంలో రద్దీ ప్రాంతాలు..
వాహనాలు నడపడం.. నిలపడం సమస్యే
పార్కింగ్ జోన్ల గుర్తింపులో
అధికారుల నిర్లక్ష్యం
అవస్థలు పడుతున్న పాదచారులు,
వాహనదారులు

ట్రాఫిక్ తంటాలు..

ట్రాఫిక్ తంటాలు..

ట్రాఫిక్ తంటాలు..

ట్రాఫిక్ తంటాలు..