
ముందుజాగ్రత్తలతోనే ఆరోగ్యం
వనపర్తిటౌన్: ముందుజాగ్రత్తలు పాటిస్తూ.. ఆరోగ్య సూత్రాలను నిత్య జీవితంలో అలవర్చుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యానికి కొదవ ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంఽస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. స్వీయ మెళకువలు పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి మించిన సంపద లేదన్నారు. ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అన్నారు. ఉచిత న్యాయసేవ సలహాల కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్ సంప్రదించాలని సూచించారు. అనంతరం సీపీఆర్ చేసే విధానంపై జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మంజుల, న్యాయవాది ఉత్తరయ్య పాల్గొన్నారు.