
మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు
వనపర్తి: నియోజకవర్గంలో మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి చుక్క నీరు అందని పరిస్థితి ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం లింక్ కెనాల్ ఏర్పాటు చేసి పలు మండలాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. అదే విధంగా రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం
వనపర్తి: అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని.. 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర తమదని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గ్రామగ్రామానా సమావేశాలు నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలు, ప్రజలను సమాయత్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ అశోక్ ఉన్నారు.
సాగునీటి కోసం
రైతుల ఆందోళన
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతు లు ఆందోళనకు దిగారు. ఆత్మకూర్ మండలంలోని ఆరెపల్లి, కత్తేపల్లి, తూంపల్లి గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు జూరాల ప్రధాన ఎడమ కాల్వ వద్దకు చేరుకొని గద్వాల– అమరచింత రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చేతికొచ్చే దశలో ఉన్న యాసంగి పంటలకు సాగునీటి విడుదలను నిలిపివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి సాగుకు వారబందీ ద్వారా సాగునీటిని క్రమం తప్పకుండా అందిస్తామన్న అధికారులు.. సమాంతర కాల్వ ద్వారా ప్రాజెక్టులో ఉన్న నీటిని తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. వారబందీ విధానంలో మరో రెండు పర్యాయాలు సాగునీరు వదలా లని డిమాండ్ చేశారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులపాటు సాగునీటిని కాల్వలకు వదులుతామని ప్రాజె క్టు అధికారులు ప్రకటించడంతో రైతులు ధర్నా ను విరమించారు. పంటలు చేతికొచ్చే వరకు సాగునీరు అందించాలని కోరుతూ ఏఈ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు.
రామన్‌పాడు @
1,015 అడుగులు
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో సోమవారం 1,015 అడుగులకు నీటిమట్టం చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎమడ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.

మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు

మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు