
నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పుల రాజు, రజిత దంపతుల కుమారుడు శివ(22) అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యాడు. మేస్త్రిగా పని చేస్తున్న రాజు తనకున్న ఎకరం భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాల్ని చిన్నప్పటి నుంచి చూసిన శివకు వారి కోసం ఏదైనా చేయాలని ఉండేది.
రూ.1.50 లక్షలు చెల్లిస్తే కమీషన్ల రూపంలో నెలకు రూ.20 వేలు వస్తాయని తెలిసినవారు అతడికి చెప్పారు. అలా మూడేళ్ల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ (ఈకామర్స్ బిజినెస్)లో చేరాడు. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇప్పటి వరకు కమీషన్లు రాలేదు. కానీ.. రెండుసార్లు బెంగళూరు టూర్‌కు తీసుకెళ్లారు. నర్సంపేటలో డిగ్రీ చదువుతున్న శివ చెల్లి సింధు బర్త్ డే ఈనెల 15న బుధవారం ఉండడంతో అదే రోజు శివ ఇంటికి ఫోన్ చేసి చెల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో సింధు ‘అన్నయ్య ఇంటికి రావొచ్చు కదా’ అంటే.. ‘ఉగాది పండుగకు వస్తాలే’ అని శివ అన్నాడు.
పక్కనే ఉన్న తల్లితో.. గంటసేపు మాట్లాడాడు. ‘నిన్ను చూడబుద్ధి అయితంది బిడ్డా.. జర వీడియో కాల్ చేయరాదు’ అని తల్లి రజిత అనడంతో ‘ఫ్రీ అవ్వగానే ఓ గంట తర్వాత చేస్తా’ అని శివ అన్నాడు. అవే అతడి చివరి మాటలయ్యాయని తల్లి రజిత, చెల్లి సింధు విలపించడం కన్నీరు పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment